అంతులేని కథ: అమరావతి ఉద్యమానికి 800 రోజులు?
అమరావతి పరిరక్షణ పేరిట సాగుతున్న ఈ ఉద్యమానికి ఇవాళ్టితో 800 రోజులు పూర్తవుతున్నాయి. ఉద్యమానికి 800 రోజులైన సందర్భంగా రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి గ్రామంలో కొందరు రైతులు 24 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దీన్ని అమరావతి ప్రజా దీక్ష పేరుతో నిర్వహిస్తున్నారు.
ఈ రైతుల నిరాహార దీక్షకు సంఘీభావంగా పలు పార్టీల నాయకులు వచ్చి మద్దతు తెలపనున్నారు. టీడీపీ, జనసేన, బిజెపి, సిపిఐ నాయకులతో పాటు బిజెపి నుంచి కన్నా లక్ష్మీనారాయణ, వల్లూరి జయప్రకాష్ హాజరవుతున్నట్టు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక సిపిఎం నుంచి హాజరు కానున్న మధు, బాబూరావు హాజరుకానున్నారు. అయితే అమరావతి రైతులు ఎన్ని ఉద్యమాలు నిర్వహించినా అవి ఆ 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్ప.. ఉద్యమం ఇతర ప్రాంత ప్రజలను కదిలించలేకపోతోంది.
దాదాపు మూడేళ్లుగాఈ అమరావతి ఉద్యమం సాగుతున్నా.. చెప్పుకోదగ్గ ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వం దిగివచ్చే సూచనలే లేవు.. ఇక ఈ ప్రభుత్వం దిగిపోతే తప్ప అమరావతి పరిరక్షణ అన్న లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం దిగి వచ్చేలా.. ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో అమరావతి జేఏసీ నాయకులు విఫలం అవుతున్నారు. ఇలా కొనసాగితే రోజుల సంఖ్య పెరగడం తప్ప అమరావతి రైతులు సాధించేదేమీ ఉండదంటున్నారు విశ్లేషకులు.