అంతా కేసీఆర్ వల్లే.. వివరాలు బయటపెట్టిన కిషన్ రెడ్డి..?

తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా సహకరించకపోవడం వల్లే.. రైల్వేలో పనులు ఆలస్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలంగాణ సర్కారు నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1300 కి.మీ. లకు పైగా రైల్వే పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎదురవుతున్న ఈ సమస్యలపై చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించి, తెలంగాణ ప్రజలకు రైల్వేలను మరింత చేరువ చేయడానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

తెలంగాణకు కేంద్రం గణనీయంగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు పెంచిందని కిషన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో రైల్వే పనుల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ₹2,420 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 25% పెంచి ₹3,048 కోట్లు కేటాయించిందని ఆ లేఖలో తెలిపారు. 2014-20 మధ్య కాలంలో కేటాయించిన సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కంటే 3 రెట్లు అధికంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేయడం జరిగిందని కిషన్ రెడ్డి వివరించారు. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునికీకరణలో భాగంగా చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణ రైల్వేలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. కొన్ని వివరాలు తెలిపారు.

కేవలం కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వవలసిన రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకపోవడం వల్ల అనేక పనులు ఆలస్యం అవుతున్నాయన్న కిషన్ రెడ్డి... రైల్వేల నిర్మాణం కోసం భూమి సేకరించి ఇవ్వకపోవడం మూలంగా, తగాదాల పరిష్కారంలో చొరవ చూపకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1300 కి.మీ.లకు పైగా రైల్వే పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని వివరించారు. వాటిలో ప్రధానంగా కాజీపేట్ - విజయవాడ : 220 కి.మీ.,  కాజీపేట్ - బాలార్ష : 201 కి.మీ.,  మణుగురు - రామగుండం : 200 కి.మీ., మనోహరాబాద్ - కొత్తపల్లి : 151 కి.మీ.,  కృష్ణా - వికారాబాద్ : 145 కి.మీ., బోధన్ - లాతూర్ : 134 కి.మీ., కొండపల్లి - కొత్తగూడెం : 82 కి.మీ., మునీరాబాద్ - మహబూబ్ నగర్ : 66 కి.మీ., కరీంనగర్ - హసన్ పర్తి : 62 కి.మీ., భద్రాచలం రోడ్ - సత్తుపల్లి : 54 కి.మీ.,  అక్కన్నపేట్ - మెదక్ : 17 కి.మీ., కాజీపేట్ - హసన్ పర్తి రోడ్ : 11 కి.మీ. ఉన్నాయని కిషన్ రెడ్డి తన లేఖలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: