జగన్‌ సర్కార్‌: ఆ రెండు విషయాల్లో తగ్గేదే..లే..?

కేంద్రం ఇటీవల ప్రకటించిన త్రిసభ్య కమిటీ భేటీ ఎజెండా అంశంతో మరోసారి ప్రత్యేక హోదా అంశం ఏపీలో చర్చకు వచ్చింది. ఈ ఎజెండాలో మొదట ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం చేర్చింది. దీంతో మరోసారి ఈ ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఏపీ, తెలంగాణ విభజన సమస్యల కోసం వేసిన త్రిసభ్య కమిటీ ప్రత్యేక హోదాపై ఏం చర్చిస్తుందన్న అనుమానం చాలా మందికి అప్పుడే వచ్చింది.. కానీ.. ఏమో ఏం చర్చిస్తారో.. మొత్తానికి ఏదోలా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది కదా అని ఏపీ శ్రేయోభిలాషులు సంబరపడ్డారు.


అయితే.. ఆ సంబరం కొన్ని గంటలు కూడా నిలవలేదు. మళ్లీ ఎంజెడాను రివైజ్‌ చేసి.. ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారు. దీంతో .. అసలు ఎందుకు ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో పెట్టారు.. మళ్లీ ఎందుకు తొలగించారు అన్న అంశంపై రాజకీయ పార్టీల మాటల యుద్ధం మొదలైంది. ఇందుకు కారణం మీరంటే మీరని నిందించుకోవడం ప్రారంభించారు. అలా... ఈ ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ అయ్యింది.


ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేది లేదని మరోసారి జగన్ సర్కారు స్పష్టం గా చెప్పింది. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా, మూడు రాజధానుల అంశాలపై జగన్ సర్కారు నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రాజధాని రావటం తథ్యం అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పేశారు. విశాఖకు తప్పకుండా పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని మంత్రి బొత్స కుండబద్దలు కొట్టారు. ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదని మంత్రి తెలిపారు.


మూడు రాజధానులే వైసీపీ సర్కారు విధానం. ఈ విషయంలో తగ్గేది లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా  మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామన్నారు. రాజధానుల బిల్లులో లోపాలు సవరిస్తున్నాం.. త్వరలోనే  కొత్త బిల్లుతో మీ ముందుకొస్తామని మంత్రి బొత్స తేల్చి చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటు, ప్రత్యేక హోదా సాధన.. ఈ రెండు అంశాలు మా విధానంలో భాగం అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అంటే.. ఈ విషయాల్లో వైసీపీ ఎక్కడా తగ్గేదే.. లే.. అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: