గుజరాత్ Vs తెలంగాణ: విద్వేషాలు ఆపండ్రోయ్..?
టీఆర్ఎస్ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమేమీ కాదు.. ఆ మాటకొస్తే మొదటి ఆరేడు ఏళ్లు కేసీఆర్ మోడీకి బాగానే సహకరించారు. ఏవో ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా ఆరోపణలు, ప్రత్యారోపణలు వంటివి తక్కువే. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అన్న రేంజ్‌లో విమర్శలు చేసుకుంటున్నారు. తిట్టుకోవడంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. అయితే.. ఇక్కడ అవాంఛనీయ పరిణామం చోటుచేసుకుంటోంది.
బీజేపీ, టీఆర్ఎస్ తిట్టుకునే సమయంలో రాష్ట్రాల ప్రస్థావన తెస్తున్నారు. మోడీ గుజరాతీ కాబట్టి.. తెలంగాణ వర్సెస్ గుజరాత్ అన్న కోణాన్ని బయటకు తెస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు.. తెలంగాణ అభివృద్ధి చూసి మోడీ కన్నుకుట్టిందని.. అందుకే తెలంగాణను ఎదగనీయకుండా చేస్తున్నారని కొత్త రాగం అందుకున్నారు కొందరు టీఆర్ఎస్ నాయకులు.. ఇలాంటి విమర్శలకు తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
పార్టీల మధ్య గొడవల్లోకి రాష్ట్రాలను లాగడం ఏమాత్రం అభిలషణీయం కాదు. తెలంగాణ, గుజరాత్ రెండూ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలే.. గుజరాత్ తెలంగాణ కంటే ఇంకా ముందు ఉంటుంది.. అందులోనూ మోడీ కటాక్షాలు పుష్కలంగా ఉన్న రాష్ట్రం కాబట్టి నిధుల విషయంలో ఎంతో అనుకూలతలు ఉన్నాయి. అంతవరకూ ఓకే.. మోడీ పక్షపాతం కూడా ఓకే.. కానీ దీన్ని తెలంగాణ వర్సెస్ గుజరాత్ గా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం మానుకోవాలి. పార్టీల మధ్య చిచ్చును రాష్ట్రాల మధ్య చిచ్చుగా మార్చకండి.. ప్రజల మధ్య విద్వేషాలు పెంచకండి.. ప్లీజ్..