ఎన్టీఆర్‌: బాబు చేతులారా ఛాన్స్ మిస్‌ చేసుకున్నారా..?

చంద్రబాబు నాయుడు ఎవరు..? ఏంటీ చచ్చు ప్రశ్న.. ఆయన టీడీపీ అధినేత.. ఆ మాత్రం తెలియదా.. అనకండి.. మరి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు.. నందమూరి తారక రామారావు.. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను సైతం ఆయన సొంత పార్టీ నుంచి తప్పించి.. పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని ఆయన బతికి ఉండగానే అధిరోహించిన వ్యక్తి చంద్రబాబు.. అంతే కాదు.. వ్యవస్థాపకుడి వెంట పార్టీ వెళ్లకుండా.. పార్టీ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబును చాణక్యుడితో పోలుస్తారు.

అయితే.. ఆ అధికార మార్పిడి జరిగిన కొద్దికాలంలోనే ఎన్టీఆర్‌ మరణించడంతో విషయం అక్కడితో సమసిపోయింది. ఎన్టీఆరే బతికి ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. ఆయన మరణంతో టీడీపీ అంతా ఒక్కటిగానే ఉండిపోయింది. ఎన్టీఆర్ టీడీపీని ఆయన భార్య లక్ష్మీపార్వతి బతికించే ప్రయత్నం చేసినా ఆమెకు ఆ సత్తా, తెలివి, వ్యూహం లేకపోయాయి. ఇక అప్పటి నుంచి చంద్రబాబు తాను ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే ప్రతి పార్టీ కార్యక్రమంలోనూ ఎన్టీఆర్‌ పేరు స్మరించుకుంటారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయకుండా ఏ పార్టీ కార్యక్రమం కూడా ప్రారంభించరు. అయితే.. ఎప్పటి నుంచో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ ఉంది. కానీ.. ఎందుకనో చంద్రబాబు ఆ డిమాండ్‌ను ఆయన అధికారంలో ఉన్నంత వరకూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ మరణం తర్వాత అంటే 1996 నుంచి 2004 వరకూ చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ 2014 నుంచి 2019 వరకూ అవశేష ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా కృష్ణా జిల్లా పేరు మార్చే ప్రయత్నం చేయలేదు.

ఇప్పుడు అది జగన్‌కు వరంగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆయన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. చూశారా.. టీడీపీ అధికారంలో ఉండగా చేయలేనిది.. వైసీపీ అధికారంలోకి వచ్చాకే ఎన్టీఆర్‌కు ఆ గౌరవం కల్పించామని చెప్పుకునే అవకాశం కల్పించారు. ఇది చంద్రబాబు చేతులారా చేసుకున్నదే.. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: