శభాష్: జగన్ 'నాడు నేడు' - కేసీఆర్ 'మన ఊరు మన బడి'

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ పాఠశాలలు బాగు చేసేందుకు నడుంబిగించారు. ఏపీ సీఎం జగన్ ఈ పని రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. నాడు-నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేశారు. ఇందు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అసలు ప్రభుత్వ పాఠశాలలు అంటేనే ఎవరూ పట్టనట్టుగా ఉండేవి.. ఉపాధ్యాయుల జీత భత్యాల కోసం వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టేవి కావు. కానీ.. ఏపీలో జగన్ సీఎం ఈ విషయంలో అద్భుతాలే చేశారు.

ప్రభుత్వాలు తలచుకుంటే ఎంతగా పాఠశాలలను బాగు చేయగలవో చేసి చూపించారు. ఇవి ప్రభుత్వ బడులా.. కార్పొరేట్ స్కూళ్లా అని అనుమానం వచ్చే స్థాయిలో బాగు చేసిన బడుల చిత్రాలు ఎన్నో మీడియాలోనూ వచ్చాయి. ముందుగా పాత బడిని ఫోటోలు తీసి ఉంచి.. అభివృద్ధి చేసిన తర్వాత ఆ బడిని ఫోటో తీసి..ఇదిగో.. ఇలాంటి బడిని మేం అధికారంలోకి వచ్చాక ఇలా చేశాం అని చెప్పడమే ఉద్దేశ్యంగా నాడు-నేడు పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఏ ప్రభుత్వమైనా.. విద్యపై ఎంత పెట్టుబడి పెట్టినా అది వృథా కానే కాదు.

జగన్ సర్కారు ఇచ్చిన స్ఫూర్తో.. మరింకేమి కారణమో తెలియదు కానీ.. ఇప్పుడు కేసీఆర్ సర్కారు కూడా జగన్ బాటులోనే వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మొన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఇందు కోసం ఖర్చు చేయాలని కేబినె‌ట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోవడం చాలా మంచి మార్పుగా చెప్పుకోవచ్చు.

ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడం అంటే.. పేదలను బాగు చేయడమే.. ప్రైవేటు బడులను పంపించే స్థోమత లేని బడుగు, బలహీన వర్గాల పిల్లలే ఇంకా ప్రభుత్వ పాఠశాల్లలో చదువుతున్నారు. వారి జీవితాలను బాగు చేసే ఇలాంటి నిర్ణయాలను స్వాగతించాల్సిందే. అంతా మెచ్చుకోవాల్సిందే. కేసీఆర్ సర్కారు చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమం విజయవంతం కావాలని మనసారా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: