ఏంటీ అరాచకం జగన్.. ఇదేమీ బాగాలేదు..?

మాట తప్పను.. మడమ తిప్పను.. ఇదీ తరచూ వైఎస్ కుటుంబం గురించి అనుకునే మాట.. మొదట్లో ఈ డైలాగ్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనేవారు.. ఆ తర్వాత రాజకీయ వారసత్వంలో భాగంగానే ఈ డైలాగ్‌ కూడా జగన్‌కు వారసత్వంగా వచ్చింది. మాట తప్పను.. మడమ తిప్పను.. అంటూ జగన్ తన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు. అందులో మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటాం అన్నది కూడా ఒకటి. జగన్ తరచూ నా అక్కచెల్లెమ్మలు అంటూ మహిళలను ఆప్యాయంగా పలకరిస్తుంటారు.

అలాంటి అక్కచెల్లెమ్మల జీవితాల్లో మంచి మార్పు రావాలంటే మద్యపాన నిషేధం ఒక్కటే మార్గం అని జగన్ పాదయాత్రలో అనేకసార్లు చెప్పారు. అయితే.. మద్యపానాన్ని ఒకేసారి నిషేధిస్తే అమలు ఇబ్బందవుతుంది కాబట్టి తాను అధికారంలోకి వస్తే.. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే మద్యం దుకాణాల సంఖ్యను ఏటా 20 శాతం క్రమంగా తగ్గిస్తామని జగన్ మహిళలకు మాట ఇచ్చారు. అలాగే ఏటా తగ్గించుకుంటూ వెళ్లి చివరకు కేవలం స్టార్‌ హోటళ్లలో మాత్రమే మద్యం దొరికేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. దశలవారీగా మద్యపానం అమ్మకాలు తగ్గిస్తామని మొదట్లో చెప్పిన జగన్.. అందుకు మద్యం ధరలు పెంచడం ఓ మార్గం అని ప్రజలకు చెప్పారు. ఎక్కువ రేట్లు ఉంటే.. తాగేవారి సంఖ్య తగ్గుతుందని ఆయన భావించారేమో.. అంతే కాదు.. మంచి బ్రాండ్లు ఉంటే.. అవే తాగుకుంటూ ఆ అలవాటు మానుకోలేకపోతారని.. అందుకే మంచి బ్రాండ్లు అమ్మడం లేదని వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు.

అయితే.. ఆచరణలో అన్నీ విఫలమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఏపీలో మంచి బ్రాండ్లు దొరికేవి కాదు. కానీ కొన్నిరోజుల క్రితమే ఏపీలోనూ మంచి బ్రాండ్లు అమ్మాలని నిర్ణయించారు. అంతే కాదు.. ధరలు కూడా పెంచకుండానే అమ్ముతున్నారు. ఇక ఇప్పుడు మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా మరో నిర్ణయం తీసుకున్నారు. అదే.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలు గంట పొడిగించడం. అంటే ఇక రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయన్నమాట. మరి ఇలాంటి విధానాలతో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని జగన్ ఇచ్చిన హామీ నెరవేరుతుందా.. అలాంటి నమ్మకం ఏమీ కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: