దేవుడా.. ఆంధ్రాలో సినిమా తప్ప ఇంకే సమస్యలు లేవా..?

ఆంధ్రప్రదేశ్ లో కొన్నిరోజులుగా సినిమా టికెట్ల సమస్యపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మంత్రి పేర్ని నాని.. డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ మధ్య కొన్నిరోజులు సోషల్ మీడియా వార్ నడిచింది. దీంతో నానికి అనుకూలంగా కొందరు.. వర్మకు అనుకూలంగా కొందరు సోషల్ మీడియాలో డాటాలు ఖర్చయ్యేలా కొట్టుకున్నారు. ఆ తర్వాత క్రమంగా సమస్య కొలిక్కి వచ్చింది.  మంత్రి గారూ నాకు అపాయిట్‌మెంట్ ఇవ్వండి.. నేనొచ్చి మీతో మాట్లాడతా అని వర్మ సోషల్ మీడియా ముఖంగా అభ్యర్థన పెట్టుకుంటే దానికి పేర్ని నాని ఓకే చెప్పారు.

అలా ఓ అంగీకారానికి వచ్చిన నాని, వర్మ సోమవారం మొత్తానికి భేటీ అయ్యారు. వర్మ చెప్పిందంతా విన్న నాని.. ఓకే.. మీరు చెప్పినవన్నీ నోట్ చేసుకున్నాం..కానీ మా వాదన ఇదీ అని ఆయన వాదన ఆయన వినిపించాడు.. అది విని వర్మ కూడా కాస్త కన్విన్స్ అయినట్టే కనిపించాడు. మొత్తానికి చర్చలు సంతృప్తికరంగా సాగాయని వర్మ చెప్పాడు. ఇదంతా మీడియాల్లో ప్రముఖంగా వచ్చింది. రెండు, మూడు రోజుల నుంచి ఏపీ మీడియాలో ఇదే ఇష్యూ హైలెట్ అయ్యింది.

అయితే.. ఈ రచ్చ అంతా చూసిన టీడీపీ నేత పయ్యావలు కేశవ్‌... వార్నీ ఇదేం గోల.. ఏపీలో ఇంకేమీ సమస్యలు లేవా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేనట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఏ సమస్యలేనట్టు.. సినిమా టిక్కెట్ల ధరల గురించి మాత్రమే  మంత్రులు చర్చించుకుంటున్నారని.. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయని పయ్యావుల సెటైర్‌ వేశారు.

రైతుల సమస్యల గురించి మంత్రులు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. రైతు సమస్యలు, తగ్గిన ఉద్యోగుల జీతాలు, నిరుద్యోగుల కోసం మంత్రులు చర్చించరా అని నిలదీశారు. అంతేకాదు.. మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడ్డం మానేశారని.. ఈ రాష్ట్రంలో సినిమాలకు మించిన సమస్యలు చాలా ఉన్నాయని పయ్యావుల కేశవ్ అన్నారు. సోమవారం నాటి పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగిందని.. కోవిడ్ కారణంగా సంబంధిత అధికారి సమావేశానికి రాలేకపోయారని.. కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదని పయ్యావుల తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: