రేవంత్‌ బుల్లెట్‌: కీచక రాఘవ.. ప్రగతిభవన్‌లోనా.. ఫామ్‌హౌస్‌లోనా?

వనమా రాఘవేంద్ర ఎక్కడ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో.. ప్రత్యేకించి తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన ఇష్యూ ఇది.. ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడానికి కారణమైన ఈ కీచకుడు రాఘవేంద్ర టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు. సామూహిక ఆత్మహత్య జరిగి మూడు రోజులు అవుతోంది. ఆత్మహత్య లేఖలో నిందితుడు వనమా రాఘవేంద్ర పేరు రాశాడు. అప్పటి నుంచి రాఘవేంద్ర పరారీలోనే ఉన్నాడని చెబుతున్నారు.

అయితే సదరు రాఘవేంద్ర చేసిన అరాచకాలను బాధితుడు రామకృష్ణ స్వయంగా సెల్ఫీ వీడియో ద్వారా బయటపెట్టడం సంచలనానికి దారి తీసింది. అయితే.. ఇంత జరిగినా ఇంకా సదరు రాఘవేంద్రను పోలీసులు పట్టుకోలేదు. మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన వనమా రాఘవేంద్ర.. ఆ తర్వాత మాత్రం కనిపించడం లేదట. పోలీసులు ఇంకా తాము వెదుకుతూనే ఉన్నామని చెబుతున్నారు.

ఇప్పుడు ఈ అంశం రాజకీయంగానూ వేడెక్కించింది. అధికార పార్టీ అండ చూసుకునే వనమా రాఘవేంద్ర ఇంతగా రెచ్చిపోయాడని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఒకింత ఘాటుగానే స్పందించారు. కీచక రాఘవ ఎక్కడున్నాడు..   ప్రగతిభవన్‌లోనా.. ఫామ్‌హౌస్‌లోనా? అంటూ  రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్టు చేస్తున్నారు కదా.. మరి వనమా రాఘవను రోజుల తరబడి పట్టుకోలేకపోవడం ఏంటని రేవంత్ రెడ్డి నిలదీస్తున్నారు.

వనమా రాఘవేంద్రను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇంతటి దారుణ ఘటనపై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. అధికార పార్టీ అండ చూసుకునే రాఘవేంద్ర రెచ్చిపోయాడని.. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే వనమా రాఘవ పోలీసుల అదుపులో లేడన్న మాటలు మాత్రం జనం నమ్మడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: