టాలీవుడ్‌ ఫైట్‌: చిన్న సినిమా వర్సెస్‌ పెద్ద సినిమా..?

టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. చిన్న సినిమాలకూ పెద్ద సినిమాలకూ పరోక్ష యుద్ధం సాగుతోంది. దర్శకుడు రాజమౌళి పుణ్యమా అని టాలీవుడ్‌ రేంజ్‌ బాలీవుడ్‌ రేంజ్‌కు చేరింది. బాహుబలి వంటి సినిమాతో దర్శక దిగ్గజం రాజమౌళి పాన్ ఇండియా కల్చర్‌కు శ్రీకారం చుట్టాడు.. ఇప్పుడు అదే తెలుగు సినీచిత్రసీమలో పరోక్ష యుద్ధానికి కారణం అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్, పుష్ప, ఆదిపురుష్‌.. ఇలా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఇవి వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. మరి ఇలాంటి సినిమాలకు పెట్టిన డబ్బులు తిరిగి రావాలంటే.. సినిమా టికెట్ల ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉండాలి.

కానీ.. సినిమా టికెట్ల ధరలు క్రమబద్దీకరిస్తూ కొన్ని రోజుల క్రితం ఏపీ సర్కారు ఓ జీవో తీసుకొచ్చింది. దీనిప్రకారం నగరాల్లో కాస్త ఓకే కానీ.. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ల ధరలు రూ. 5, 10, 20, 25.. ఇలా ఉన్నాయి. ఈ టికెట్ల ధరలతో తమ సినిమాలకు నష్టం అని పెద్ద నిర్మాతలు భావిస్తున్నారు. ఏపీలో ఈ జగడం ఇంకా నడుస్తూనే ఉంది. మొత్తానికి ఈ సమస్యపై ఓ కమిటీ వేయాలని ఏపీ సర్కారు ఇటీవల నిర్ణయించింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినిమా టికెట్ల ధరలను పెంచేసింది. కొత్తగా వచ్చిన ధరలను బట్టి.. ఐమాక్స్, మల్టిప్లెక్స్ థియేటర్లలో ఒక్కోటికెట్ ధర 250 రూపాయల నుంచి 300 వరకూ ఉంటోంది.

పాన్ ఇండియా సినిమాల వరకైతే.. ఈ టికెట్ల ధరలు ఓకే.. పాన్ ఇండియా సినిమాలకు ఉండే క్రేజ్‌ కారణంగా ప్రేక్షకుడు కొంతవరకూ ఈ ధరలు భరించి చూసే అవకాశం ఉంది. అయితే.. ఇవే రేట్లు చిన్న సినిమాలకూ వర్తిస్తాయి.. ఇక్కడే వస్తోంది అసలు చిక్కు. ఇంత ధరలు ఉంటే.. వాటిని భరించి చిన్న సినిమాలకు ప్రేక్షకులు వచ్చే అవకాశం తక్కువ. దీనివల్ల చిన్న సినిమాలకు కలెక్షన్లు పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: