సోము వీర్రాజు కరెక్టుగానే చెప్పాడు.. సరిగ్గా ఆలోచించండి..?

ఏపీలో కోటి మంది ఓటర్లున్నారు.. వారంతా వచ్చే ఎన్నికల్లో బీజేపీకే ఓటేసి గెలిపిస్తే.. మేం అధికారంలోకి వచ్చాక రూ. 70కే చీప్‌ లిక్కర్ బాటిల్ ఇప్పిస్తాను.. రెవెన్యూ ఇంకా బావుంటే రూ. 50కే చీప్‌ లిక్కర్ ఇప్పిస్తాను... ఇదీ నిన్న ప్రజాసంగ్రామ సభలో సోము వీర్రాజు చెప్పిన మాటలు. ఇప్పుడు ఇవి బాగా ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ మాటలు బీజేపీ పరువు తీసేశాయని ఆ పార్టీ నాయకులే తలలు పట్టుకుంటున్నారు. చివరకు ఈ మాటలు జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించాయి. అలా బీజేపీ పరువు జాతీయ స్థాయిలో పోయినట్టయింది.

అవును.. నిజమే.. సోము వీర్రాజు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. అయితే ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి.. సోము వీర్రాజు మాటలను ట్రోల్ చేసే వాళ్లంతా గమనించాలి.. అసలు ఈ సమాజమే ఒక్కసారి తనకు తాను పరిశీలించుకోవాలి.. చివరకు చీప్ లిక్కర్‌ తగ్గిస్తే చాలు ఓటర్లు ఓటేస్తారని సోము వీర్రాజు అనుకున్నాడు.. అయితే.. ఆయన ఒక్కడే అలా అనుకుంటున్నాడా.. ఏం.. ఎన్నికల్లో సారాయి పోయిస్తే చాలు.. ఓట్లు వేయంచుకోవచ్చని ఎన్ని పార్టీలు అనుకోవడం లేదు. అసలు ఓట్లకీ మద్యానికి ఉన్న లింకు మనకు తెలియనిదా..?

అవును.. మొదటి నుంచి మద్యం తాగేవారంటే లోకువే.. వాస్తవమే.. నిజంగానే మద్యం ఆరోగ్యానికి హానికరం.. మద్యం ఎన్నోజీవితాలను నాశనం చేస్తుంది.. ఎన్నో కుటుంబాల్లో చిచ్చురేపుతుంది. ఇదీ నిజమే.. ఈ వాస్తవం ఇటీవల మనకు కొత్తగా తెలిసిందేమీ కాదు.. కానీ ఇప్పుడు ప్రభుత్వాలే మద్యంపై నడుస్తున్నాయే.. మద్యం అమ్మకాల సొమ్ములు రాకపోతే.. ఆదాయం లేని దుస్థితి వచ్చేసిందే.. మద్యం ఇంకాస్త ఎక్కువ తాగండి బాబూ అంటూ మద్యం ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు మార్గాలు వెదుకుతున్నయే దాన్ని ఏమందాం..?

సోము వీర్రాజు మన లోగుట్టు కాస్త గట్టిగా చెప్పాడంటే.. ఎలాగూ మాంసం తింటున్నాం కదా అని బొక్కలు మెడలో వేసుకున్నాడు అంతే.. మన ఆధునిక సమాజంలో.. కాదు కాదు.. ఆధునిక ప్రజాస్వామ్య లో మద్యం ఎంత కీలక పాత్ర పోషిస్తోందో.. మన సోము వీర్రాజు కుండబద్దలు కొట్టేశాడు.. శభాష్‌ సోము బీర్రాజు.. సారీ.. సోము వీర్రాజూ.. శభాష్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: