తెలంగాణ కంటే ముందే ఏపీలో కమలవికాసమా..?

ఉత్తరాదిలో దూసుకుపోతున్న బీజేపీ దక్షిణాదిలోనూ పాగా వేయాలని కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు కర్ణాటకలో అధికారం సాధించడంతోనే ఆగిపోతున్నాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలోనూ పాగా వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తున్నా సానుకూల ఫలితాలు కనిపించడం లేదు. కర్ణాటక మినహా ప్రస్తుతం దక్షిణాదిలో తెలంగాణలోనే కాస్తో కూస్తో బీజేపీ బలంగా ఉంది. తెలంగాణలో ఆ పార్టీకి తక్కువ సంఖ్యలో అయినా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు కూడా. ఇటీవలి కాలంలో దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలు గెలుచుకున్నారు. ఇక జీహెచ్‌ఎంసీలో గెలిచినంత పని చేశారు. అందుకే తెలంగాణలో గెలిచినా గెలవకపోయినా గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్‌ లోని అనైక్యత బీజేపీకి కలసి వస్తోంది. అయితే.. ఇప్పుడు ఏపీపైనా బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే.. తెలంగాణ కంటే ముందే ఏపీలో అధికారంలోకి వస్తామని తాజాగా విజయవాడలో జరిగిన ప్రజాగ్రహసభలో కొందరు నాయకులు కామెంట్లు చేస్తున్నారు.

పార్టీలో ఉత్సాహం నింపుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చేయవచ్చు కానీ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏపీలో ఏ కోశానా కనిపించడం లేదు. ఏపీలో బీజేపీ ఇలా నిస్తేజంగా ఉండటానికి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా కారణంగా చెప్పొచ్చు. టీడీపీ నుంచి కొంతకాలం క్రితం గంపగుత్తగా బీజేపీలోకి నాయకులు వచ్చారు. వారు ఇప్పుడు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు కాకుండా బీజేపీకి సొంతంగా గట్టి నాయకులు కరవయ్యారు.

దీనికి తోడు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలంగానే ఉంది. ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ఉంటే.. ఆ ప్రభావంతో ఓటర్లు టీడీపీ వైపు వెళ్తారు తప్ప.. బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు దాదాపు శూన్యం అనే చెప్పాలి. ఏపీలో బీజేపీ ఎదిగితే అది పొత్తులతో తప్ప.. సొంతంగా సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: