కమ్యూనిస్టులూ.. సిద్ధాంతాలు కాదు.. జనం గోడు వినండి?

కాస్త బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే పార్టీలు ఏంటి అని అంటే ముందుగా గుర్తొచ్చేది కమ్యూనిస్టు పార్టీలే. కానీ.. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్కరంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా అసెంబ్లీలో లేరంటే వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కమ్యూనిస్టులు ఇటీవల తమ మహాసభలు నిర్వహించుకుంటున్నారు. కమ్యూనిస్టుల్లో ప్రధానంగా ఉన్న పార్టీలు సీపీఎం, సీపీఐ. ఎర్రజెండానే ఎత్తుకున్నా ఈ రెండు పార్టీల్లో సిద్ధాంత వైరుధ్యాలు చాలానే ఉన్నాయి.

తాజాగా జరిగిన సీపీఎం మహాసభల్లో మరోసారి కమ్యూనిస్టుల ఐక్యత అంశం చర్చకు వచ్చిందట. కమ్యూనిస్టుల ఐక్యతపై సీపీఎం మహాసభల్లో ఆసక్తికరమైన చర్చ జరిగిందట. లెఫ్ట్‌ పార్టీలు కలవాలని అందరూ కోరుకుంటున్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారట. కమ్యూనిస్టులు కలవాలని ఎప్పుడో 16 ఏళ్ల క్రితమే బీవీ రాఘువులు విలీన ప్రతిపాదన చేశారని.. కానీ.. ఇప్పటి వరకూ రాఘవులు చేసిన ప్రతిపాదనపై ఒక్క అడుగూ ముందుకెళ్లలేదని సీపీఐ రామకృష్ణ గుర్తు చేశారట.

దీనికి బదులిచ్చిన బీవీ రాఘవులు.. అబ్బే.. రాజకీయాలు, ఓట్లు-సీట్ల కోసం కలిస్తే కమ్యూనిస్టులు కలిస్తే లాభం ఉండదు.. అని తేల్చి చెప్పేశారట. విధానాలు కలిసినప్పుడే లెఫ్ట్ పార్టీల ఐక్యత సాధ్యమన్నారట రాఘవులు. దీనికి స్పందించిన రామకృష్ణ.. కనీసం విధానాలపై చర్చయినా జరగాలి కదా అని ప్రశ్నించారట. అలా మరోసారి కమ్యూనిస్టుల ఐక్యత అంశం చర్చకు వచ్చింది.

కమ్యూనిస్టుల ఐక్యత సంగతి ఎలా ఉన్నా.. ముందు ఆ పార్టీలు ముందు తెలుగు ప్రజల సమస్యలపై ఫోకస్ పెడితే బావుంటుంది. వారు చెప్పే సిద్ధాంతాలు సామాన్యులకు ఎంత వరకూ అర్థమవుతాయన్నది ఆలోచించాలి.. తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల సమస్యలేంటి.. వాటికి పరిష్కారాలేంటి..అందుకు చేయాల్సిన కార్యాచరణ ఏంటి.. ఈ దిశగా ఎర్రన్నలు కదిలితే.. జనం కూడా ఆ పార్టీల గురించి ఆలోచిస్తారు.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: