కరోనా టీకా: ఒకే రోజు 2 గుడ్‌న్యూస్‌లు - పోలా.. అదిరిపోలా..?

క్రిస్మస్ పండుగు రోజు.. దేశానికి నిజంగానే పండుగ రోజుగా మారింది. ఈ రోజు దేశానికి రెండు గుడ్ న్యూస్‌లు వచ్చాయి. దేశంలోని 15-18 మధ్య వయస్సు పిల్లలకు కూడా కరోనా టీకా వేస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇది నిజంగా చాలా మంచి నిర్ణయం.. పిల్లల్లో కరోనా వస్తున్నది తక్కువే అయినా.. 15- 18 ఏళ్ల మధ్య వయస్సు వారిని కేవలం పిల్లలుగా పరిగణించలేం.. వారు యువత కిందకు వస్తారు. అలాంటి వారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామం.

ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన పిల్లల కొవిడ్‌ టీకాకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చేసింది. ఈ మేరకు డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. అంటే ఇకపై 12 నుంచి 18 ఏళ్ల వారికి కూడా భారత్‌లో కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చినట్టయింది. పిల్లల టీకాకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అందుకే మోడీ సర్కారు ముందుగా 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించింది. 12 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా అందుబాటులోకి వచ్చినా అందరికీ ఒకేసారి టీకా ఇవ్వాలంటే లభ్యత సమస్య వస్తుంది.

ఇప్పటికే మన దేశంలో సెకండ్ డోస్‌ తీసుకోవాల్సిన పెద్దల సంఖ్య కోట్ల లోనే ఉంది. ఇంకా దేశంలో సగానికి మందికి పైగా సెకండ్ డోస్ తీసుకోవాల్సి వుంది. ఫస్ట్ డోస్ మాత్రమే 90 శాతానికి మంచిన నమోదు ఉంది. ఇప్పుడు పిల్లల టీకాలకు కూడా అనుమతులు వచ్చినందున ఉత్పత్తి పెంచాల్సి ఉంటుంది. దీనికి తోడు బూస్టర్ డోసులకు కూడా కేంద్రం షరతులతో అనుమతి ఇచ్చేసింది. ఇప్పుడు బూస్టర్ డోసులకు కూడా కరోనా టీకా అందుబాటులో ఉంచాల్సి ఉంది.

ఏదేమైనా టీకాల విషయం భారత్ స్వయం సమృద్ధి సాధించినందువల్లే ఇప్పుడు ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నా భారత్ మాత్రం నిబ్బంరంగా ఉంది. ఇక పిల్లలకు కూడా కరోనా టీకా అందుబాటులోకి తెస్తే.. ఆ తర్వాత కరోనా గురించి భారత్ పెద్దగా చింతించాల్సిన అవసరం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: