టార్గెట్‌ జగన్‌ : అమరావతి ఉద్యమం.. ఎంతవరకూ సఫలం?

అమరావతి ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారుస్తామని అసెంబ్లీలో జగన్ ప్రకటన చేసినప్పుడు మొదలైన ఉద్యమం.. చాలారోజులు సాగింది. ఆ తర్వాత కరోనా సమయంలో పూర్తిగా చప్పబడింది. మళ్లీ కరోనా తగ్గడంతో న్యాయ స్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేసిన పాదయాత్ర ఈ ఉద్యమాన్ని మరోసారి వార్తల్లో నిలిపింది. అయితే ఇప్పటికీ అమరావతి ఉద్యమం కేవలం కొందరి ఉద్యమంగా మారడం మాత్రం ఆలోచించాల్సిన విషయంగానే చెప్పాలి.


అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ నుంచే సపోర్ట్ ఎక్కువగా లభించింది. ఆ పార్టీ రైతుల ముసుగులో ఈ పాదయాత్ర చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. వాస్తవానికి ఈ పాదయాత్ర సాధారణ పాదయాత్రలా జరగలేదు. బౌన్సర్లు వంటి అట్టహాసాల నడుమ ఈ యాత్ర సాగింది. ఎక్కడికక్కడ హంగు ఆర్భాటాలతో యాత్ర సాగింది. అదే సమయంలో ఈ పాదయాత్రకు జనం నుంచి స్పందన కూడా పెద్దగా లభించలేదు. వాస్తవానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంశం అయినప్పుడు అన్ని ప్రాంతాల నుంచి భారీగా మద్దతు కనిపించాలి. కానీ అలాంటిదేమీ ఈ అమరావతి ఉద్యమంలో కనిపించడంలేదు.


దీనికి తోడు ఈ పాదయాత్రను ఓ వర్గం మీడియా ప్రత్యేకించి ప్రమోట్ చేసిన తీరు చూస్తే అది ఎవరి దర్శకత్వంలో సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు అమరావతి అనేదే ఓ పార్టీ వ్యవహారంగా.. కొన్నిగ్రామాల వ్యవహారంగా మారడం నిజంగా ఆవేదన కలిగించే అంశమే. అయితే.. ఇది రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిపోకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే కనిపిస్తోంది. అయితే.. ఇంత జరిగినా ఫలితం ఉంటుందా.. అమరావతి రైతుల పోరాటం ఫలిస్తుందా అంటే సంతృప్తికరమైన సమాధానం లభించదు.


ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును సమగ్రంగా మళ్లీ పెడతామని జగన్ సర్కారు చెప్పింది. కొత్త చట్టంతో కోర్టులు కూడా పెద్దగా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తప్ప.. అమరావతి రైతుల అభీష్టం నేరవేరే అవకాశం లేకపోవచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: