హంగూ ఆర్భాటం లేకుండా చకచకా కానిచ్చేస్తున్న కేసీఆర్..?
తెలంగాణ సచివాలయ నిర్మాణం దాదాపు ఓ కొలిక్కి వస్తోంది. అయితే.. అసలు ఇంతగా నిర్మాణాలు పూర్తయ్యాయన్న విషయం కూడా పెద్దగా జనానికి తెలియదు. మొన్న కేసీఆర్ నిర్మాణాలను సందర్శించి సమీక్షించిన సమయంలో చూస్తే దాదాపు భవనాల నిర్మాణం ఓ కొలిక్కి వచ్చింది. ఇక ఇంటీరియర్ పనులు మిగిలిపోయాయి. సాధారణంగా ఇదే పని మరో నాయకుడు చేస్తే.. దీనికి చాలా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు.. పనులు జరుగుతున్న సమయంలో అనేక విధాలుగా సమీక్షలు చేసి.. ఎప్పటి కప్పుడు మీడియాకు పనుల అప్డేట్స్ పంపి.. హంగామా చేసేవారే.
గతంలో అమరావతి నిర్మాణం సమయంలో ఎంత హడావిడి జరిగిందో చూశాం. కానీ.. హడావిడిలో 25 శాతమైనా వాస్తవ రూపం దాల్చలేదు. కానీ.. కేసీఆర్ విషయానికి వస్తే ఆయన సైలంట్గా తాను అనుకున్నవి చేసుకుంటూ వెళ్తున్నారు. సచివాలయం పూర్తి కావస్తోంది. ఇప్పటికే తాను అనుకున్న కాళేశ్వరం పూర్తి చేశారు. ఇక జిల్లాల్లో కొత్త కలక్టరేట్లు వచ్చేశాయి. ఇలా ఒక్కొక్కటిగా తాను అనుకున్నవి పూర్తి చేసేస్తున్నారు కేసీఆర్.
అయితే.. కేసీఆర్ ఇంత సైలంట్గా ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తెలంగాణకు ఉన్న ఆర్థిక వెసులుబాటు కూడా కారణమే కాదనలేం. కానీ.. హంగూ ఆర్భాటాలు లేకుండా పని చేసుకుపోతున్న తీరును మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఇదే సమయంలో ఆయన గతంలో చెప్పి చేయనివీ చాలా ఉన్నాయి. కానీ.. చేసింది మెచ్చుదాం.. చేయనిది చేయాలని అడుగుదాం.. ఏమంటారు?