రేవంత్‌ రెడ్డి కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా..?

రేవంత్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న నాయకుడు.. అయితే.. రేవంత్ రెడ్డి ఈ పదవి అందుకునేందుకు బాగానే కష్టపడ్డారు. అసలు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానంటేనే వస్తా అంటూ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతోనే బేరాలు ఆడుకున్నారని చెబుతారు. మొత్తానికి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత తన సొంత ఇమేజ్ కోసం ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి పట్టుదలకు మెచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ మొత్తానికి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసింది.

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ కానీయకుండా కాంగ్రెస్‌లో చాలా పెద్ద పోరే నడిచింది. అందుకే ఆ అంశం చాలా నెలలు పెండింగ్‌లో ఉంది. మొత్తానికి రేవంత్‌ రెడ్డికే పీసీసీ పగ్గాలు ఖాయం అయ్యాయి. ఇక ఒకసారి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక తన సత్తా చూపేందుకు రేవంత్ రెడ్డి కూడా బాగానే కష్టపడ్డారు.. ఇంకా కష్టపడుతున్నారు. అయితే.. రేవంత్‌ రెడ్డి టీడీపీ నుంచి వచ్చి నాయకుడిగానే ఇంకా కొందరు కాంగ్రెస్ నేతలు చూస్తుంటారు. వారే పార్టీలో రేవంత్‌ రెడ్డి కాళ్లలో కట్టెలు పెడుతుంటారు. అయితే.. కాంగ్రెస్‌లో ఇవన్నీ మామూలే అన్న ఐడియా ఉన్న రేవంత్ రెడ్డి వారిని వ్యూహాత్మకంగానే ఎదుర్కొంటూ వస్తున్నారు.

పార్టీలో జోష్ నింపేందుకు దళిత, గిరిజన దండోరా పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. అనేక చోట్ల సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ కృషి మొత్తం హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమితో అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పుడు కాంగ్రెస్‌లోని వారు చాలా మంది రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఇక భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వాటిలో ఓ అడుగు ముందే ఉంటారు. అందుకే ఆయన కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి తన ఉద్యమం మొదలుపెడతానంటూ ప్రకటించారు.

ఏపీలో కాంగ్రెస్‌ లేదనుకుంటేనే 6 వేల ఓట్లు వచ్చాయని.. కానీ.. తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లు రాలేదని కోమటిరెడ్డి కామెంట్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నా ప్రాణం- సోనియాగాంధీ నా దేవత అన్న కోమటిరెడ్డి.. మా పార్టీ నేతలే అప్పుడు దయ్యం ఇప్పుడు దేవత అంటున్నారని వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: