పవన్.. చివరకు ఆ కుల నాయకుడిగా మిగిలిపోతారా..?

పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు.. 2014కు ముందే జనసేన అంటూ పార్టీ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకూ చెప్పుకోతగ్గ విజయాలేమీ నమోదు చేయలేదు. చివరకు స్వయంగా తాను కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయితే అటు సినిమాలు... ఇటు రాజకీయాలు రెండు పడవలపై కాలుపెట్టడం.. స్థిరమైన వ్యూహం లేకపోవడం.. నిలకడ లేకపోవడం వంటి కారణాలతో పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ సరైన విజయం  నమోదు చేయలేకపోయారు.

అయితే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఓవైపు తెలుగుదేశం బాగా బలహీన పడిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను దక్కించుకోవాలని ఆరాపటపడుతున్నట్టు కనిపిస్తోంది. అంతే కాదు. ఆయన వ్యూహంలోనూ మార్పు కనిపిస్తోంది. గతంలో పవన్ తనకు తాను కాపు నాయకుడిగి చెప్పుకునేందుకు ఇష్టపడేవాడు కాదు.. అందరివాడు అన్న ఇమేజ్ కోసం తాపత్రయపడేవారు. కానీ ఇవేవీ వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు ఏకంగా కాపు కులంపై ఫోకస్ చేస్తున్నాడు.

మొన్న మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలోనూ.. ఆ తర్వాత రాజమండ్రిలోనూ ఆయన మాట్లాడిన తీరు చూస్తే వచ్చే ఎన్నికల్లో కాపు కులం ఆధారంగా ఆయన రాజకీయాలు సాగించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. కాపు కులస్తులు ముందుకు వస్తేనే ఏపీ బాగుపడుతుందని ఆయన మాట్లాడటం చూస్తే ఆయన వ్యూహం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏపీలో కాపు కులస్తుల సంఖ్య గణనీయంగానే ఉంది. ఆ విషయంలో సందేహం లేదు. కానీ కేవలం కాపు కులస్తులు ఓటేస్తే పవన్ అధికారంలోకి వచ్చేస్తారా.. అన్న సందేహాలు తలెత్తక తప్పదు.

అంతే కాదు.. ఇప్పటి వరకూ ఇలా నేరుగా కులాన్ని ప్రస్తావించి మాట్లాడిన నాయకులు లేరు. ఇప్పుడు పవన్ ఆ సాహసం చేస్తున్నాడు. తనను తాను కొందరివాడుగా మార్చుకుంటున్నాడు. మరి ఈ వ్యూహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది.. అందరివాడుగా ఉన్నప్పుడే ప్రభావం చూపని పవన్ కొందరివాడుగా సత్తా చాటతాడా.. లేక చివరకు ఓ కుల నాయకుడిగా మిగిలిపోతాడా.. చూడాలి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: