బండి సంజయ్‌ లక్కీ.. రేవంత్‌ బ్యాడ్‌లక్‌..?

తెలంగాణ రాజకీయాలు మళ్లీ రంజుగా సాగుతున్నాయి. ఓవైపు హుజూరాబాద్‌ ఎన్నికల సందడి జోరందుకుంది.. మరోవైపు కేసీఆర్‌ మరోసారి ముందస్తుకు వెళ్తారా అన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. అయితే విపక్షాలుగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా తమ జోరు పెంచేశాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంచి జోరు మీద ఉన్నారు. అయితే.. వీరిద్దరిలో బండి సంజయ్ కాస్త లక్కీ అని చెప్పకతప్పదు.

ఎందుకంటే.. బండి సంజయ్‌కు తన పార్టీ హైకమాండ్ నుంచి చక్కటి సహకారం అందుతోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి అంత మంచి సహకారం తన సొంత పార్టీ హైకమాండ్‌ నుంచి లభించడంలేదు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవం రోజు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులూ వచ్చారు.

ఇలా బీజేపీలోనే నెంబర్ టూగా పేరున్న అమిత్‌ షా ఇప్పటికే రెండు, మూడు సార్లు తెలంగాణకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనివల్ల బీజేపీ కార్యకర్తల్లోనూ హుషారు పెరిగింది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడయ్యాక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దళిత, గిరిజన దండోరాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ జంగ్ సైర్ మోగించారు. కానీ.. ఈ కార్యక్రమాలకు జాతీయ స్థాయి నాయకులు పెద్దగా కనిపించలేదు.

ఒక్క సభలో మాత్రం మల్లిఖార్జున ఖర్గే కనిపించారు. బీజేపీ తరహాలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేదా.. ఇతర జాతీయ నేతలు రేవంత్‌ రెడ్డికి సహకారం అందిస్తే.. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉత్సాహం పెరుగుతుంది. ఈ విషయంలో రేవంత్‌తో పోలిస్తే సంజయ్ చాలా లక్కీ అని చెప్పక తప్పదు. మరి ఈ విషయం కాంగ్రెస్ పెద్దలు గ్రహిస్తారా.. రేవంత్‌కు సహకారం అందిస్తారా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: