'సాక్షి' కోణం: బాబు చేస్తే దారుణం.. జగన్ చేస్తే ఆదర్శం..!

ఎవరైనా అధికారం సంపాదించాలన్నా.. వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా ఏం ఉండాలి.. ఈ ప్రశ్నకు సమాధానంగా.. చిత్తశుద్ధి.. అంకితభావం, ప్రజలకు సేవచేసే తత్వం.. ఇలాంటి సమాధానాలు చెప్పకండి.. అవి ఎలాగూ అవసరం అనుకోండి.. కానీ.. వాటితో పాటు.. ఇంకా చెప్పాలంటే.. వాటికి మించి ఒకటి ఉండాలి.. అదే మీడియా.. సొంత మీడియా.. తమదైన మీడియా అంటూ ఉంటే రెండు లాభాలు.. మన వాదన మనం బలంగా జనంలోకి తీసుకెళ్లొచ్చు.. ఎదుటి వాడి వాదన తప్పని ప్రచారం చేయించొచ్చు.


ఇప్పుడు ఏపీలో సాక్షి పత్రిక అదే చేస్తోందనిపిస్తోంది.. సాక్షి సీఎం జగన్ సొంత పత్రిక అన్న సంగతి తెలిసిందే. ఈ పత్రిక జగన్ అనుకూలవార్తలకే పెద్దపీట వేస్తుందన్న సంగతీ తెలుసు.. ఇక ప్రత్యర్థి చంద్రబాబు, టీడీపీ నేతలపై సాక్షి ఏకంగా పాశుపతాస్త్రమే. జగన్ అధికారంలోకి రావడంలో సాక్షి మీడియాది కూడా ప్రధాన పాత్ర అని చెప్పక తప్పదు. జగన్ అధికారంలోకి రావడానికే కాదు.. ప్రస్తుతం జగన్ అధికారం నిలబెట్టుకోవడానికి కూడా సాక్షి తన వంతు ప్రయత్నాలు చేస్తుంటుంది.


తాజాగా ఏపీ సీఎం జగన్ సచివాలయం ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ విధానం మంచిదే.. దీని కారణంగా ఉద్యోగులు ఠంచనుగా సమయానికి వస్తారు. సమయ పాలన పాటిస్తారు. ఆఫీసుకు రాకుండానే అటెండెన్స్ వేసుకునే అరాచకాలకు అడ్డుకట్ట పడుతుంది. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే.. ఇలాంటి లాభాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సాక్షి ఆ కోణంలోనే వార్త రాసింది. అయితే ఇందులో తప్పేముంది అనిపించొచ్చు. వాస్తవానికి తప్పుకూడా ఏమీ లేదు.


కానీ.. ఇదే సాక్షి గతంలో ఇదే నిర్ణయం చంద్రబాబు సర్కారు తీసుకున్నప్పుడు ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేసింది. భయోమెట్రిక్ అంటూ భయపెట్టింది. బయో మెట్రిక్ కారణంగా ఉద్యోగులకు ఇబ్బందులు అంటూ రాసుకొచ్చింది. అంటే విపక్షంలో ఉంటే ఒకవిధంగా.. అధికారంలో ఉంటే మరోవిధంగా.. అందుకే ప్రతి నాయకుడూ సొంత మీడియా ఉండాలని తెగతాపత్రయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: