హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు.. తెలంగాణలో హాట్ పొలిటికల్ టాపిక్.. అయితే.. ఈ హుజూరాబాద్ ఉపఎన్నిక పరిణామాలు పరిశీలిస్తే.. ఇది కేసీఆర్ కొనితెచ్చుకున్న తలనొప్పిగా కనిపించకమానదు. సొంత పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ వంటి బలమైన నాయకుడిని.. తానే స్వయంగా బయటకు పంపి ఉపఎన్నికకు కారణం అయ్యారు కేసీఆర్. ఈటల రాజేందర్‌ తనంతట తాను పార్టీ నుంచి వెళ్లిపోతే.. అది వేరే సంగతి కానీ.. పార్టీ నుంచి వెళ్లగొట్టిందే కేసీఆర్. అందువల్ల కేసీఆర్ ఈటల రాజేందర్ అనే శత్రువును కొని తెచ్చుకున్నట్టు అయ్యింది.


పోనీ.. ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి వెళ్లగొట్టినా ఆ తర్వాత ఆ ఇష్యూని పట్టించుకోకుండా వదిలేస్తే పోయేది.. కానీ.. పార్టీ కూడా ఈటల రాజేందర్‌పై పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈటలను ఓడించాలంటూ కేసీఆర్ చూపిస్తున్న పట్టుదల ఈటలపై గెలుపును ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో అర్థం అవుతుంది. ఇలా కాకుండా లైట్‌గా తీసుకుంటే.. మళ్లీ ఈటల గెలిచినా పెద్దగా పట్టింపు ఉండేది కాదు. పోనీ.. గెలవనీ.. ఏమైంది.. ఓ ఎమ్మెల్యే అంతే కదా అన్నట్టుగా ఉండేది పరిస్థితి.


కానీ ఇప్పుడు.. హుజురాబాద్‌ కేసీఆర్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా ఆయన తన ఫ్రస్టేషన్‌ను తానే బయటపెట్టుకున్నట్టయ్యింది.  హుజూరాబాద్‌ కోసం ఏకంగా ఎదుటి పార్టీ నేతలను ఆకర్షించడం.. అనేక పథకాలు ప్రకటించడం.. ఏకంగా దళిత బంధు ప్రకటించడం.. హుజూరాబాద్‌ నేతలకు పదవులు అప్పగించడం.. ఇలాంటి చర్యలతో ఇప్పుడు కేసీఆర్ పంతం మరింతగా పెరిగింది.


ఒకవిధంగా ఇప్పుడు టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌లో గెలిచినా ఈటలకు వచ్చిన నష్టమేమీ ఉండనిపరిస్థితి.. కేసీఆర్ తన సర్వశక్తులు ఒడ్డి అధికారం అడ్డుపెట్టుకుని పథకాల పేరిట డబ్బు పంచి గెలిచారని అంటారు తప్ప.. ఆ గెలుపుతో టీఆర్ఎస్‌కు వచ్చే అదనపు రాజకీయ ప్రయోజనమూ ఉండదు. కానీ ఓడిపోతే మాత్రం అది టీఆర్ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. పార్టీలోని అసంతృప్తులంతా గళం పెంచుతారు. మొత్తానికి హుజూరాబాద్ కేసీఆర్‌కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: