హుజూరాబాద్‌: కేసీఆర్‌కు షాక్ ఇస్తున్న సకల జనులు..?

కేసీఆర్ హూజూరాబాద్ ఉప ఎన్నికపై కొంతకాలం నుంచి ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఉపఎన్నిక. ఈ ఎన్నికల్లో పొరపాటున టీఆర్ఎస్ ఓడిపోయిందంటే.. అది టీఆర్‌ఎస్ భవితవ్యంపై పెను ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారబలంతో పాటు అన్ని రకాల బలాలు ఉన్నా... హూజూరాబాద్‌లో ఈటలను కేసీఆర్ ఓడించలేకపోతే.. ఆ పార్టీలోని అసంతృప్త స్వరాలన్నీ ఒక్కసారిగా బయటపడతాయి. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ హుజూరాబాద్ ఉపఎన్నికను గెలవాలన్న పట్టుదల కేసీఆర్‌లో ఉంది.


హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు వంటి పథకాన్ని తెచ్చారన్న వాదన కూడా ఉంది. ఏదేమైనా కేసీఆర్ హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. లాంఛనంగా కొందరికి చెక్కులు కూడా ఇచ్చారు. హుజూరాబాద్‌లో  15-20 శాతంగా ఉన్న దళితుల ఓట్లన్నీ ఇక తెలంగాణ రాష్ట్ర సమితే గంపగుత్తగా పడతాయన్న ఆలోచనలో టీఆర్‌ఎస్‌ ఉంది. దీనికి తోడు ఎలాగూ బీసీ నాయకుడికి అక్కడ పోటీకి అవకాశం ఇచ్చింది. ఈ రెండింటి కాంబినేషన్‌తో హూజూరాబాద్ ను గెలవాలని కేసీఆర్ వ్యూహం రచించారు.


అయితే.. ఇప్పుడు ఈ వ్యూహం క్రమంగా బెడిసికొడుతున్నట్టు కనిపిస్తోంది. హూజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇతర వెనుక బడిన సామాజిక వర్గాలు కూడా తమకు కూడా బంధు పథకం అమలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే రెడ్లు, కుమ్మరులు వంటి వారు రెడ్డి బంధు, కుమ్మరి బంధు పెట్టాలని ఆందోళన కూడా నిర్వహించారు. ఇలా దళిత బంధు పథకం ప్రభావం మిగిలిన కులాలపై నెగిటివ్‌గా పడిందన్న ప్రచారం సాగుతోంది. కేవలం దళితులు మాత్రమే వెనుకబడి ఉన్నారా.. మేం వెనుకబడి లేమా అన్న ప్రశ్నలు అనేక సామాజిక వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.


అందుకే ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు. బీసీ బంధు కావాలని.. ఓసీ బంధు కావాలని.. ఇలా అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి వీరందరికీ కేసీఆర్ ఎలా సమాధానం చెబుతారో.. ఎలా శాంతింపజేస్తారో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: