ప్రణబ్, నరసింహన్‌, కోవింద్: కేసీఆర్ దళిత రాజకీయంపై రేవంత్ షాక్స్?

కేసీఆర్‌ ఈ మధ్య జోరుగా పఠిస్తున్న మంత్రి దళిత బంధు.. దళితులను ఆదుకోవాలని ఆయన పదే పదే పిలుపు ఇస్తున్నాడు. దళితులను ధనికులను చేసి వారి తలరాతలు మారుస్తానంటున్నాడు.. భారత దేశంలోనే ఎవరూ ఇవ్వనంతగా ఒక్కో కుటుంబానికి ఏకంగా రూ. 10 లక్షలు ఇస్తానంటున్నాడు.. అది కూడా అందరు దళితులకూ ఇస్తానంటున్నాడు.. ఉద్యోగి, నిరుద్యోగి బేధం లేదు.. ధనిక, బీద తారతమ్యం లేదు.. దళితులైతే చాలు.. దళిత బంధు వర్తిస్తుందని చెబుతున్నాడు.


అయితే.. ఇదంతా హుజూరాబాద్ ఓట్ల కోసమే అనుకున్నారు చాలా మంది. అయితే.. ఈ కేసీఆర్ దళిత రాజకీయంపై పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. ఇటీవల హుజూరాబాద్‌లో జరిగిన దళిత బంధు ప్రారంభ కార్యక్రమంలో దళితుడైన ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను సీఎంవో కార్యదర్శిగా నియమిస్తున్నానని ప్రకటించారు. ఇది సంచలనం సృష్టించింది.. చివరకు ఐఏఎస్‌లకు కూడా కులాలు ఆపాదిస్తున్నారన్న వాదనలూ వినిపించాయి.


అయితే ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రావిర్యాల సభలో విమర్శలు గుప్పించారు. రాహుల్ బొజ్జాను ఓట్ల కోసమే సీఎంఓలో కార్యదర్శిగా నియమించారని విమర్శించారు. కేసీఆర్ కు మొదటి నుంచి దళితులపై వివక్ష ఉందని ఓట్ల కోసమే ప్రస్తుతం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ గవర్నర్ నరసింహన్‌లకు బోర్లాపడి దండాలు పెట్టిన కేసీఆర్.. దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కనీసం చేతులెత్తి దండం పెట్టలేదని గుర్తు చేశారు.


తెలంగాణ రాష్ట్రానికి మొదటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ... తర్వాత ఎస్కే జోషీ.. మొదటి డీజీపీ అనురాగ్ శర్మ.. వీళ్ళ ముగ్గురు రిటైర్ అయితే వాళ్ళ వాళ్ళ పదవి కేసీఆర్ పొడిగించారని..వాళ్ళను ఇప్పుడు ప్రత్యేక సలహాదారులుగా నియమించుకున్నారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర సీఎస్‌ అయితే ఒక్క నేలకే ఇంటికి పంపారని విమర్శించారు. కేసీఆర్ వేధింపులు తట్టుకోలేకే ప్రవీణ్ కుమార్ ఆరేళ్లు సర్వీసు ఉండగానే రాజీనామా చేశారని రేవంత్ విమర్శించారు. మొత్తానికి కేసీఆర్‌కు దళిత బంధు రాజకీయ లబ్ది రాకుండా చేసేందుకు రేవంత్ యత్నించారని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: