విపక్షాల్లో గుబులు పుట్టిస్తున్న కేసీఆర్ బ్రహ్మాస్త్రం..?

ఇప్పుడు తెలంగాణలోని అనేక సామాజిక వర్గాలు ఒక బంధువు కోసం ఎదురు చూస్తున్నాయి. బంధువు అంటే చుట్టమో పక్కమో కాదు.. వారు కోరుకునేది సర్కారు బంధువు.. ఇప్పటికే కేసీఆర్ చల్లని చూపు దళితులపై పడిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమో.. లేదా.. మరో రెండేళ్ల రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసమో కానీ.. కేసీఆర్ ఉన్నట్టుండి కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాజకీయాల్లో దళిత బంధు ప్రకటన ద్వారా పెను కలకమే సృష్టించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ నిర్ణయం ద్వారా కేసీఆర్ విపక్షాలను ఆత్మ రక్షణ ధోరణిలో పడేయ గలిగారు.


వాస్తవానికి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు.. ఎన్నికలపై పెను ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే.. తెలంగాణ ఓటు బ్యాంకులో అధికారికంగానే దళితుల సంఖ్య 16 శాతం వరకూ ఉంది. అయితే వాస్తవానికి ఇది 20 శాతం వరకూ ఉంటుందని సాక్షాత్తూ కేసీఆరే ప్రకటించారు. మరి 20 శాతం ఓటు బ్యాంకుపై అమోఘంగా పని  చేసే అస్త్రం ఈ దళిత బంధు.. అందులోనూ ఇంటికి ఏకంగా రూ. 10 లక్షల రూపాయలు డైరెక్టుగా ఇచ్చేయడం.. అసలు ఇండియాలోనే ఇలాంటి పథకం ఇప్పటి వరకూ ఎవరూ ప్రకటించలేదు.


అందుకే ఈ దళిత బంధును విమర్శించాలంటే తెలంగాణలో పార్టీలు ముందుకు రావడం లేదు. ఈ పథకాన్ని ఏమాత్రం వ్యతిరేకించినా దళితుల ఓట్లు పోతాయి. అందుకే అన్ని పార్టీలు ఇష్టం ఉన్నా లేకపోయినా.. ప్రాక్టికాలిటీ ఉన్నా లేకపోయినా ఈ పథకాన్ని స్వాగతించాయి. అయితే ఈ పథకం క్రెడిట్‌ కేసీఆర్‌ ఖాతాలోకి వెళ్తే అది ఎన్నికలపై పెను ప్రభావం చూపుతుంది. అందుకే దీన్ని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచించడం ప్రారంభించాయి.


కేసీఆర్ ప్రయోగించిన  దళిత బంధు అస్త్రం నుంచి ఎలా బయటపడాలా అన్న వ్యూహాల్లో పార్టీలు ఉన్నాయి. అందుకే  కేసీఆర్ పాత హామీలను గుర్తు చేస్తూ దళితుల్లో అపనమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది పక్కా ఎన్నికల అస్త్రమని.. గతంలోనూ కేసీఆర్ ఇలాంటి మాటలు చెప్పి అమలు చేయలేదని గుర్తు చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: