కొల్లు, అచ్చెన్న, ధూళిపాళ్ల, ఉమ.. తర్వాత లోకేశేనా..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఓ కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడినీ అరెస్టు చేశారు. పాపం.. ఆయన తనకు పైల్ల్ ఉన్నాయి మొర్రో అంటున్నా వినకుండా గంటల తరబడి పోలీసులు జీబులో విజయవాడ తీసుకొచ్చారు.
ఇక ఇప్పుడు నారా లోకేశ్ వంతు వచ్చిందన్న అంచనాలు వస్తున్నాయి. ఈ విషయం సాక్షాత్తూ టీడీపీ నేతలే చెబుతున్నారు. ఇటీవల మైలవరం మైనింగ్ అంశంపై కాస్త రచ్చ చేసి జైలుకు వెళ్లిన దేవినేని ఉమ.. బెయిల్ పై విడుదలైన సమయంలో చేసిన కామెంట్లు భవిష్యత్ పరిణామాలను సూచిస్తున్నాయా అనిపిస్తోంది. నారా లోకేశ్‌ను నెల రోజుల్లో అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు కూడా.
మరి దేవినేని ఉమ కావాలనే ఈ మాట అన్నారా.. లేక ఏదైనా సమాచారంతో అలా అన్నారో తెలియదు కానీ.. అదే జరిగితే.. మరోసారి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం ఖాయం. నారా లోకేశ్ కూడా ఈ మధ్య దూకుడు పెంచారు. అనేక అంశాలపై ఆందోళనకు దిగుతున్నారు. జనంలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పై కూడా ఏదైనా కేసు పెట్టి జైలుకు పంపుతారేమో అన్న ఆందోళన టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. దేవినేని ఉమ మాటలు అందుకు మరింత బలాన్నిస్తున్నాయి. మరి జగన్ సర్కారు అంత పని చేస్తుందా.. లేదా.. అన్నది ఓ నెల రోజుల్లో తేలిపోతుంది.