బీజేపీ, జనసేన.. ఎడబాటు ఖాయమేనా..?

Deekshitha Reddy
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందనే విషయం అందరికీ తెలుసు. అయితే ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రజా పోరాటాల్లో మాత్రం ఆ కలివిడితనం కనిపించడంలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది పరిస్థితి. ఏపీలో జాబ్ క్యాలెండర్ తో జనసేన సెపరేట్ ఉద్యమం మొదలు పెట్టింది. ఇందులో బీజేపీకి భాగస్వామ్యం లేదు. ఇటీవల రైతుల దుస్థితిపై కూడా జనసేనాని ప్రత్యేక ఉద్యమం మొదలు పెడతానంటున్నారు. దీనిలో కూడా బీజేపీ కలసి వస్తుందో లేదో తెలియదు.
అటు బీజేపీ కూడా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఏపీ ప్రాజెక్ట్ ల విషయంలో బీజేపీ నేతలు కేంద్ర మంత్రుల్ని కలసి వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం త్వరగా తేల్చేలాని, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతివ్వాలని కోరారు. ఉక్కు శాఖ మంత్రిని కలసి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపివేయించాలన్నారు. అయితే ఇక్కడ కూడా జనసేనకి ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నప్పుడు మిత్రపక్షం జనసేనని కలుపుకొని వెళ్తే ఏమవుతుంది. పవన్ కల్యాణ్ రాలేకపోయినా, పిలిస్తే పలికే నాదెండ్ల మనోహర్ ఉన్నారు కదా. జనసేన తరపున కూడా ఒకరు వెళ్లారంటే.. ఆ పార్టీకి కూడా మైలేజీ వచ్చేది కదా. కానీ బీజేపీ అలా చేయలేదు.
తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఎడబాటు..
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ బీజేపీ, జనసేన కలివిడిగా కనిపించాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గెలుపుకోసం పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేశారు. అయితే మధ్యలోనే ఆయన కరోనాబారిన పడి హైదరాబాద్ కి పరిమితం అయ్యారు. ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోవడంతో ఇరు పార్టీలకు ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలయ్యాయి. బీజేపీతో కలసి వెళ్లడం జనసేనకు లాభమేనా అనే విషయంలో వారు ఆలోచనలో పడ్డారు. ఎప్పుడూ త్యాగాలతోనే సరిపెట్టాలేమో అనుకుంటున్నారు. అటు జనసేనతో కలసి వెళ్లడం బీజేపీకి లాభమా అని ఆలోచిస్తోంది కమలదళం. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన మద్దతిచ్చినా పెద్ద ఉపయోగం లేదని బాధపడుతోంది.
ప్రధాన ప్రతిపక్షం తామేనని చెబుతున్న బీజేపీ-జనసేన.. కనీసం ఉమ్మడి పోరాటాలకు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకోలేకపోతున్నాయి. నాయకులు కలసి కనపడితేనే.. కార్యకర్తలు కూడా కలసిపోతారు. అధినాయకత్వమే ఎవరికి వారే అన్నట్టు ఉంటే.. ఇక రెండు పార్టీల కార్యకర్తల్లో భరోసా నింపేదెవరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: