రేవంత్ రెడ్డి దూకుడు చూస్తే.. కేసీఆర్ కొంప ముంచేలా ఉన్నాడే..?
తనను విమర్శించిన వీహెచ్ వంటి నేతలను కూడా పరామర్శిస్తున్న రేవంత్ రెడ్డి.. అందిరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే కొన్ని నెలలుగా తెలంగాణలో డీలా పడిన పార్టీ శ్రేణుల్లో మళ్లీ కదలిక తెస్తున్నాడు. రాజకీయ నాయకుడు నిత్యం వార్తల్లో ఉండాలి.. అదెలాగో బాగా తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడైన తొలి రోజే.. ఈటల ను బీజేపీలోకి పంపిందే కేసీఆర్ అంటూ బాంబు పేల్చాడు. కిషన్ రెడ్డికి ప్రత్యేక విమానం సమకూర్చి డిల్లీ పంపింది కేసీఆరేనని రేవంత్ రెడ్డి విమర్శించాడు.
రేవంత్ విమర్శలపై టీఆర్ఎస్, బీజేపీ కూడా పెద్దగా ఖండించలేదు. ఇక ఇప్పుడు తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు ఖాయమని రేవంత్ మరో ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్ పూర్తి కాలం పదవిలో ఉండరని.. త్వరలోనే తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో చెప్పుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి తెలంగాణలో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. కానీ.. కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు.. కార్యోన్ముఖులను చేసేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి కొత్త విషయాలు ప్రచారంలోకి తెస్తున్నారు.
మొత్తం మీద రేవంత్ రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. రేవంత్ జోష్ బీజేపీ, టీఆర్ఎస్‌లకు కాస్త కలవరం కలిగిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో బలంగానే ఉంది. దానికి కావాల్సిందల్లా దారి చూపే దీటైన నాయకత్వమే. అది రేవంత్ రెడ్డి సమర్థంగా అందిస్తే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి ప్రభావమే చూపించే అవకాశం కనిపిస్తోంది. మరి అది ఏ స్థాయిలో ఉంటుంది. రేవంత్ జోరుకు టీఆర్ఎస్, బీజేపీ ఎలా అడ్డుకుంటాయన్నది చూడాలి.