ఇస్తారా.. జంప్‌ చేయాలా..? కేసీఆర్‌పై ఒత్తిడి పెంచుతున్న సీనియర్లు..?

రాజకీయ నాయకుడు అన్నాక పదవి ఉంటేనే విలువ.. గతమెంతో ఘన చరిత్ర ఉన్నా.. ప్రస్తుతం పరిస్థితి ఏంటన్నదే ప్రధానం. సరైన పదవి లేకపోతే.. ఏ రాజకీయ నాయకుడినీ పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు టీఆర్ఎస్‌లో చాలా మంది సీనియర్లది అదే పరిస్థితి.. ఒక్కొక్కరికి దశాబ్దాల తరబడి రాజకీయ అనుభవం ఉన్నా.. ప్రస్తుతం పదవి లేక.. ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఆశాకిరణంగా కనిపిస్తోంది ఎమ్మెల్సీ సీట్లు.

అవును మరి.. ఇప్పుడు తెలంగాణలో ఆరు సీట్లు ఖాళీ అయ్యాయి. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, ఆకుల లలితతో పాటు మరో ఇద్దరు పదవీకాలం పూర్తయింది. మరి ఇప్పుడు ఈ సీట్లు ఎవరితో భర్తీ చేస్తారన్నది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ ఆరు సీట్ల కోసం చాలా మంది ఆశావహులు కాచుకుని కూర్చున్నారు. తమకు ఎలాగైనా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్ కు విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.  

వారిలో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులు ముందు వరుసలో ఉంటారు. కొంత కాలంగా వీరికి పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఎన్టీఆర్‌ హయాంలోనే మంత్రులుగా ఓ వెలిగి వెలిగిన వీరిద్దరూ ఒక విధంగా కేసీఆర్‌కు సహ అనుచరులు. ఎన్టీఆర్ వద్ద కేసీఆర్‌తో పాటు సమస్థాయిలో పని చేసినవారు. అలాంటిది ఇప్పుడు కనీసం మంత్రిపదవి కాదు కదా.. ఎమ్మెల్సీ కూడా లేకపోతే ఎవరు పట్టించుకుంటారు. అందుకే తనకు మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కడియం శ్రీహరి కోరుతున్నారు.

ఇక తుమ్మల నాగేశ్వరరావుదీ అదే పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత తుమ్మల పరిస్థితి దారుణంగా తయారైంది. అందుకే ఆయన ఎమ్మెల్సీఅయినా ఇవ్వాలని కోరుకుంటున్నారు. సీనియర్లయిన తుమ్మల, కడియంలకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోతే.. బీజేపీలోకి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.  మరోవైపు పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ కోసం ఎదురు చూస్తున్నారు. తనకు ఇవ్వకపోతే.. షర్మిల పార్టీకి వెళ్లొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. మరి కేసీఆర్ వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారో.. ఎవరిని చేజార్చుకుంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: