తెలంగాణలో 7, ఏపీలో 14 : శభాష్ కేసీఆర్, జగన్..!
సగటు మనిషి కష్టార్జితంలో చాలా వరకూ ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది. అందుకే ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఏర్పడింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ సీఎం అయ్యాక.. ఆరోగ్యశ్రీ పథకం చాలా వరకూ పేదలను ఆదుకుంది. ఆ తర్వాత క్రమంగా వైద్య రంగంపై ఫోకస్ పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసింది. ఏపీలో చంద్రబాబు వచ్చినా.. తెలంగాణలో కేసీఆర్ వచ్చినా.. ఆరోగ్య శ్రీ మాత్రం కొనసాగింది. అందులో మరికొన్ని జబ్బులను చేర్చి వైద్యం అందిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణలో కేవలం 4 మాత్రమే వైద్య కళాశాలలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చాక ఈ ఏడేళ్లలో మరో 5 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. తాజాగా కేసీఆర్ సర్కారు మరో ఏడు వైద్య కళాశాలకు పచ్చజెండా ఊపింది. సరిగ్గా ఇదే సమయంలో అటు జగన్ సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఏకంగా 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేస్తున్నారు. అంటే దాదాపు ఒకే సమయంలో తెలంగాణలో ఏడు.. ఏపీలో 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన జరగబోతోంది.
ఇప్పటికే ఏపీలో పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ప్రారంభం అయ్యాయి. ఇక విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పెనుకొండ, అదోని, నంద్యాల మెడికల్ కళాశాలలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి వైద్య కళాశాలతో పాటు, నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తారు. 2023 చివరి నాటికి కొత్త వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే శభాష్ జగన్, శభాష్ కేసీఆర్.