హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయా ?

Vijaya
జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయా ? తాజాగా జరిగిన డెవలప్మెంట్ చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. వైసీపీ నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేయటానికి వ్యతిరేకంగా ‘ప్రజాస్వామ్యం-భావవ్యక్తీకరణ స్వేచ్చ’ అనే అంశంపై లాయర్ ముప్పాళ సుబ్బారావు ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు, శైలజానాద్, రామకృష్ణ, సీపీఎం నేత పాల్గొన్నారు. సమావేశం జరిగిందే ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రాధమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, భావప్రకటన స్వేచ్చలేదని నేతలు గోల పెట్టేశారు. మీడియాను చూసి ప్రభుత్వం భయపడాల్సింది పోయి మీడియానే రాజకీయనేతలంటే భయపడుతోందని నేతలు ఆందోళన వ్యక్తంచేశారు.



విచిత్రమేమిటంటే ఎంపి తప్పుచేసుంటే యాక్షన్ తీసుకోవటంలో తప్పులేదు కానీ అసలు రఘురామ చేసిన తప్పేంటో ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదని చంద్రబాబు చెప్పటమే. పాపం రఘురామ చేసిన తప్పేంటో అసలు చంద్రబాబుక తెలీనే తెలీదట. సరే చివరకు సమావేశంలో నేతలంతా తీర్మానించిందేమంటే రఘురామకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు చేయాలని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్య పోరాటాలు చేయాల్సిందే తప్పులేదు. కానీ ఇదే సమయంలో ముందు తమలో తప్పులు లేకుండా చూసుకుంటేనే జనాలు కూడా హర్షిస్తారు. ప్రత్యర్ధులపై రాజద్రోహం కేసులు పెట్టవచ్చని తనకింతవరకు తెలీదని చంద్రబాబు చెప్పటమే విచిత్రం. 2019 ఎన్నికలకు ముందు గుంటూరులో ముస్లింల ఓట్లకోసం నారా హమారా అనే బహిరంగ సభ జరిగింది.



ఆ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నపుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటు కొందరు ముస్లిం యువకులు నినాదాలిచ్చారు. నినాదాలు ఇచ్చారనే కారణంతోనే ఓ 10 మంది యువకులపై రాజద్రోహం కేసులు పెట్టారు. అదికూడా మొదటి రెండు రోజులు అసలు కేసే పెట్టకుండా వాళ్ళని పోలీస్టేషన్ల మధ్య తిప్పి చావగొట్టారు. తర్వాత ముస్లిం నేతలంతా గోలచేస్తే అప్పుడు వాళ్ళందరిపై రాజద్రోహం కేసులు పెట్టి కోర్టుకు తరలించారు. తాను అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులపై ఎన్ని కేసులు పెట్టింది చంద్రబాబు మరచిపోయారేమో. ఏదేమైనా తప్పుడు కేసులపై పోరాటం చేయాలని అనుకోవటం మంచిదే. కానీ ముందు తాము అధికారంలో ఉన్నపుడు ఏమి చేశామనే విషయాన్ని నేతలు గుర్తుంచుకుంటేనే జనాలు మద్దతిస్తారు. లేకపోతే పోరాటాలన్నీ ఎందుకు పనికిరాకుండా పోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: