కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని మళ్ళీ లాక్ డౌన్ దిశగా నెట్టేస్తోంది. మొదటి దశలో లేనట్లుగా సెకెండ్ వేవ్ లో రోజుకు దేశంలో 3.5 లక్షల కేసులు నమోదవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు కేసుల నమోదు పెరిగిపోతుండటం, మరోవైపు మరణాలూ పెరిగిపోతుండటంతో దేశం యావత్తు వణికిపోతోంది. ప్రభుత్వాలు ఎంత కంట్రోలు చేస్తున్న కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతునే ఉంది. వీటికి అదనంగా కరోనా వైరస్ రోగులకు ఆక్సిజన్ అందక చనిపోతున్నవాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇన్ని కారణాల వల్ల కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తో జనాలు వణికిపోతున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలను చెప్పుకోవచ్చు. మొదటిదేమో ప్రభుత్వం రిలాక్సుడు మూడ్లోకి వెళ్ళిపోయింది. రెండో కారణం జనాల్లో పెరిగిపోయిన నిర్లక్ష్యం.
మరి ఈ పరిస్ధితినుండి బయటపడటం ఎలా ? ఎలాగంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం. జనాలను భౌతికదూరం పాటించమంటే పాటించరు. మాస్కు పెట్టుకోమంటేనే చాలామంది వినటంలేదు. కరోనా నిర్ధారితపరీక్షలు చేయించుకోమంటే చాలా రోజులు చేయించుకోలేదు. సెకెండ్ వేవ్ లో కేసులు పెరిగిపోతున్న కారణంగా భయపడి ఇపుడు పరీక్షలు చేయించుకునేందుకు ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే మనకు తోలుమందమనే చెప్పుకోవాలి. ఏ విషయాన్నైనా ప్రభుత్వం చెబితే మనం వినేరకం కాదు. కొరడా పట్టుకుంటేనే దారిలోకి వస్తారు మనజనాలు. జనాల మంచికోసం ప్రభుత్వం ఏమిచెప్పినా నువ్వేంటి మాకు చెప్పేదన్నట్లుగానే వ్యవహరిస్తాం.
అందుకనే మొదటి వేవ్ లో చేసిన తప్పుల వల్లే జనాలు సెకెండ్ వేవ్ లో ఫలితం అనుభవిస్తున్నారు. ఇపుడు కూడా కేసులను నియంత్రించకపోతే కష్టమనే ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టేస్తున్నాయి. తాజాగా కర్నాటకలో మంగళవారం నుండి 14 రోజులపాటు లాక్ డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుండి 4 గంటల వరకు మాత్రమే జనాలకు వెసులుబాటిచ్చింది. ఇక ఏపిలో ఎక్కడికక్కడ కొన్ని గ్రామాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. తిరుపతిని మున్సినల్ కమీషనర్ కంటైన్మెంట్ సిటీగా ప్రకటించారు. అంతర్జాతీయస్ధాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రమవ్వటంతో రోజుకు లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. దీంతో జిల్లా మొత్తంమీద 1400 కేసులుంటే తిరుపతిలోనే 700 కేసులున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ లాంటి రాష్ట్రాల్లో పరిస్ధితిలు లాక్ డౌన్ దిశగా వెళిపోతున్నాయి. కాబట్టి దేశం మొత్తంమీద తొందరలోనే లాక్ డౌన్ విధించక తప్పదేమో.