నేనే సీఎం.. అప్పుడు జగన్.. ఇప్పుడు షర్మిల.. అదే మాట..!
రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ముందు అన్నింటి కంటే కావాల్సింది ఆత్మ విశ్వాసం.. కేవలం రాజకీయ నాయకుడికే కాదు.. అసలు జీవితంలో ఎదగాలంటే కావాల్సింది ఆత్మ విశ్వాసం.. దీనికి తన లక్ష్యం ఏంటన్న స్పష్టత కూడా వుంటే విజయ సాధన మరింత సులభం అవుతుంది. ముందు తాను లక్ష్యం చేరుకుంటానన్న నమ్మకం తనకు ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఏపీ సీఎం జగన్ విషయంలో ఇది నిజమైంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జగన్.. పదే పదే ఈవిషయం చెప్పేవారు.
ఏపీకి ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యం అని నిస్సంకోచంగా చెప్పేవాడు. అప్పట్లో అది కొందరికి దురాశగానో.. అతి ఆత్మవిశ్వాసంగానో కనిపించింది. అప్పట్లో జగన్ తీరు విమర్శలపాలైంది కూడా. కానీ ముఖ్యమంత్రి అయి తీరాలన్న జగన్ పట్టుదలను అది వెల్లడి చేసింది. అదే పట్టుదలతో జగన్ వ్యుహాలు రూపొందించుకున్నారు. 2014 ఎన్నికల్లో విఫలమైనా.. మరోసారి 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మొత్తానికి అనుకున్నది సాధించారు.
ఇప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల కూడా అన్నకు తగ్గ చెల్లెలు అనిపించుకుంటున్నారు. అసలు ఓ ఆంధ్రా నాయకుడి బిడ్డగా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడమే సాహసం అని చెప్పాలి. అలాంటిది ఆమె ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయి తీరుతా అని ప్రకటించడం అంటే దుస్సాహసం అనే చెప్పాలి. కానీ అలాంటి కాన్ఫిడెన్స్ చూపించకపోతే.. ఆమెను ఎవరూ నమ్మకపోవచ్చు. ఆమె కార్యకర్తలకూ ధైర్యం చాలకపోవచ్చు. కానీ.. ఇప్పుడు షర్మిల చేసిన ప్రకటన గతంలో జగన్ చేసిన ప్రకటనను గుర్తుకు తెస్తోంది.
మరి అన్న జగన్ లాగా చెల్లి షర్మిల సక్సస్ అవుతారా లేదా అన్నది భవిష్యత్ తేలుస్తుంది.. కానీ.. ఆ ఆత్మ విశ్వాసం కనపరచడం మాత్రం రాజకీయ నాయకురాలిగా తనపై తనకు ఉన్న నమ్మకాన్ని తెలుపుతోంది. ఆమె నిజంగానే ఏదో ఒక నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మాత్రం అసాధ్యం కాకపోయినా అంత సులభమైన వ్యవహారం మాత్రం కాదు. ఈ నమ్మకానికి తోడు రాజకీయ వ్యూహాలు, సమీకరణాలు కలసిరావాలి. చూడాలి మరి షర్మిల కోరిక ఎప్పుడు తీరుతుందో..?