RRR.. రీజనల్ రింగ్ రోడ్‌.. టీఆర్ఎస్‌ నేతల భూముల్లోంచే వెళ్తుందా..?

రీజనల్ రింగ్ రోడ్.. ఇప్పుడు హైదరబాద్ శివార్లలోని భూముల రేట్లు అమాంతం పెంచుతున్న మరో ప్రభుత్వ ప్రాజక్టు.. గతంలో ఔటర్ రింగ్ రోడ్.. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల రేట్లు పెంచింది. సాధారణంగా ఇలాంటి రహదారులు అభివృద్ధికి సోపానాలు. అలాంటప్పుడు సహజంగానే ఆయా ప్రాంతాల్లో భూములకు భూమ్ వస్తుంది. అందులో తప్పు లేదు. కానీ.. ఇలాంటి ప్రాజెక్టులను తమ ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా కొందరు నాయకులు మారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రత్యేకించి రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ఇవి  వినిపిస్తున్నాయి. గతంలో ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ వృత్తాకారంలో కనిపించేది. కానీ ఇప్పుడు వస్తున్న ప్రతిపాదనలతో అది కాస్తా డైమండ్ ఆకారంలోకి మారిపోతుందేమో అన్న  వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది ఆదాయ వనరు.. రియల్ ఎస్టేట్ బిజినెస్. కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నారు. మరికొందరు తమ బంధువు పేర్లతో ఈ బిజినెస్ నడిపిస్తున్నారు.

ఇప్పుడు అలాంటి వారంతా తమ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు లాభం కలిగేలా రోడ్డు మ్యాప్ అలైన్ మెంట్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారట. కొందరు టీఆర్ఎస్ నాయకులు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారట.. ఫలానా ఏరియాలో వందల ఎకరాల భూములు కొన్నా.. రీజనల్ రింగ్ రోడ్ ఆ ప్రాంతం గూండా వచ్చేలా చేయమని ఒత్తిడి చేస్తున్నారట. మరికొందరు  మున్సిపల్, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారట.

ఈ ఒత్తిళ్ల కారణంగా రీజనల్ రింగ్ రోడ్‌ అలైన్ మెంట్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువగా  ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో జరిగే అవకాశం ఉంది చెబుతున్నారు. ప్రస్తుతం గజ్వేల్ – తూప్రాన్ – హత్నూర్ - సంగారెడ్డిని కలిపేలా రూట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అలాగే గజ్వేల్,  ఆలేరు, మూటకొండూర్, సంగెం, చౌటుప్పల్ ను కలిపేలా మార్పులు చేస్తున్నట్టు  ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: