హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తుందో తెలుసా ?

Vijaya
తొందరలోనే రాజకీయపార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల తాను ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నది చెప్పేశారు. షర్మిల మొదటినుండి ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అదీగాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు తెలంగాణాలోని అన్నీ జిల్లాల్లోను మద్దతుదారులు, అభిమానులున్నా ఖమ్మం మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. అందుకనే 2014 రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఎంపితో పాటు జిల్లాలోని మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. అప్పటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అసలు తెలంగాణాలో ఎక్కడా ప్రచారం చేయలేదు. పోటీచేసిన వాళ్ళు కూడా కేవలం వైఎస్సార్ బొమ్మ పెట్టుకునే నాలుగు చోట్ల గెలిచారు.



అంటే వైఎస్ కు జిల్లాలో ఎంత బలమైన ఫాలోయింగ్ ఉందో అర్ధమైంది కాబట్టే షర్మిల కూడా ఖమ్మంపైనే అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో తాను జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నుండి పోటీ చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని నేతలతో మాట్లాడుతు తన పోటీ విషయాన్ని ప్రకటించారు. వైఎస్ కు పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాగని చెప్పటమే కాస్త ఆశ్చర్యంగా ఉంది. పులివెందుల అంటే వైఎస్ పుట్టి, పెరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి షర్మిలకు పాలేరుతో ఉన్న అనుబంధం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు.



సరే విషయం ఏదైనా ఆమెపోటీ చేసే నియోజకవర్గాన్నైతే ఆమే స్వయంగా ప్రకటించేశారు. దాంతో జిల్లాలో రాజకీయంగా హడావుడి మొదలైపోయింది. ఎలాగూ ఏప్రిల్ 9వ తేదీ ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగసభలోనే పార్టీ జెండా, అజెండా అన్నీ వివరించబోతున్నారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి కూడా షర్మిల అప్పుడే ప్రకటిస్తారని అందరు అనుకున్నారు. అయితే షర్మిల మాత్రం ఆ విషయాన్ని ముందే ప్రకటించేయటం ఆశ్చర్యంగా ఉంది. పాలేరు మొదటినుండి ఎస్సీ కోటాలోనే ఉండేది. కాకపోతే 2009లో ఓపెన్ క్యాటగిరిలోకి మారింది. తాజాగా షర్మిల ప్రకటనతో జిల్లాతో పాటు నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణలు మారే అవకాశం లేకపోలేదు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: