హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి ఫెయిల్యూర్ కు కారణాలివేనా ? మరి పవన్ ?

Vijaya
అందరివాడినని సినిమాల్లో చెప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో మాత్రం చివరకు కొందరివాడిగానే మిగిలిపోయారు. అందుకనే రాజకీయాల్లో ఫెయిలయ్యారు. నిజానికి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యంపార్టీ పెట్టేనాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యతేమీ లేదు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ బలంగానే ఉన్నాయి. అయినా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చేయాలని చిరంజీవి అనుకున్నారు. ఇందులో ఎటువంటి తప్పు లేనప్పటికీ ఎంచుకున్న విధానంలోనే లోపముంది. పార్టీ పెట్టకుముందే సామాజికవర్గాల వారీగా చిరంజీవి తరపున సర్వే జరిగింది. అందులో సానుకూలత వచ్చిందనే పార్టీ పెట్టారు. చివరకు 17 సీట్లతో పరిమితమైపోయారు. చివరకు దాన్ని కూడా కాంగ్రెస్ లో కలిపేసి తనదారి తాను చూసుకున్నారు. దాంతో చిరంజీవిని నమ్ముకుని రెచ్చిపోయిన కాపుల్లో చాలామంది నిండా ముణిగిపోయారు.



నిజానికి కులపరమైన రాజకీయాలు ఉత్తరాధి రాష్ట్రాల్లో చెల్లుబాటైనట్లుగా తెలుగు రాష్ట్రాల్లో చెల్లుబాటుకాదు. రాజకీయాల్లో అందునా ఎన్నికల సమయంలో సామాజికవర్గాల పాత్ర కీలకమే అయినా ఎన్నికలైపోయాక మళ్ళీ వాటిని ఎవరు పట్టించుకోరు. ఆ విషయాన్ని చిరంజీవి మరచిపోయారు. పార్టీ పెట్టింది అందరివాడిగానే అయినా చివరకు పరిమితమైపోయింది మాత్రం కాపుల ప్రతినిధిగానే. ఎందుకంటే పార్టీలో అప్పట్లో అధికారాలు చెలాయించింది చిరంజీవి బావ అల్లు అరవింద్, తమ్ముళ్ళు నాగుబాబు, పవన్ కల్యాణ్, పార్టీ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టింది కూడా కాపు ప్రముఖులే. అంటే పార్టీలో ఎటు చూసినా కాపు ప్రముఖులదే నిర్ణయాత్మకం. ఇక టికెట్ల ఎంపికలో కూడా కాపులకే ప్రాధాన్యత. జిల్లా కమిటిల్లో కూడా కాపులకే ప్రాధాన్యత. చివరకు ఎలాగైపోయిందంటే ప్రజారాజ్యంపార్టీ థీమ్ సాంగ్ ను రింగ్ టోన్ గా పెట్టుకున్నారంటూ వాళ్ళు కాపులని అందరికీ అర్ధమైపోయేంత స్ధాయికి పైత్యం చేరుకుంది.



ఇటువంటి అనేక పోకడలు చిరంజీవిని ఎన్నికల్లో దారుణంగా దెబ్బకొట్టింది. కాపులకు మాత్రమే పరిమితమైన చిరంజీవి తమకు అవసరం లేదని ఇతర సామాజికవర్గాలు దూరమైపోయాయి. అలాంటి అనుభవాలను దగ్గర నుండి చూసిన తర్వాత కూడా పవన్ అన్నదారిలోనే నడుస్తున్నా కాస్త లేటైందంతే. నిజానికి ఒకప్పటి కాంగ్రెస్, ఇప్పటి వైసీపీ, తెలుగుదేశంపార్టీలు పలానా సామాజికవర్గానికి మాత్రమే పరిమైన పార్టీలని ముద్రపడలేదు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం టీడీపీపై ఆ ముద్ర బలంగా పడిపోయింది. 2019లో పార్టీ ఘోరఓటమికి ఆ ముద్ర కూడా ఓ కారణమే. కాబట్టి ఒక కులానికి మాత్రమే పరిమితమైపోయి రాజకీయాలు చేద్దామని పవన్ అనుకుంటే అన్న చిరంజీవి లాగే దుకాణం సర్దేసుకోవటమే. అసలు పవన్ రాజకీయాలు చూసిన తర్వాత అందరికీ చిరంజీవే నయమని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: