హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్షాల ‘విద్వంస’ రాజకీయాలకు డెడ్ టైన్ ఏంటో తెలుసా ?

Vijaya
అవును హఠాత్తుగా ప్రతిపక్షాలన్నీ విద్వంస రాజకీయాలను ఒక్కసారిగా ఎందుకు నెత్తికెత్తుకున్నట్లు ? ఒకపార్టీని మించి మరోపార్టీ రామతీర్ధంలో ఎందుకింత గోల చేసింది. వీటన్నింటికీ సమాధానం తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికే అనటంలో సందేహం లేదు. అంటే ఇపుడు మొదలైన విద్వంస రాజకీయాలకు తిరుపతి ఉపఎన్నికే  డెడ్ లైన్ అన్నమాట. ఉపఎన్నిక నోటిఫికేషన్ దగ్గర పడే సమయానికి ఈ గోల మరింతగా పెరిగిపోయినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రధానంగా తెలుగుదేశంపార్టీ, బీజేపీలు రాజకీయలబ్ది కోసం తెగ పాకులాడుతున్నాయి. అందుకనే రామతీర్ధం దేవాలయం విషయంలో ప్రచారం కోసం తెగ ప్రాయాసపడ్డాయి. ముందు టీడీపీ స్పందించేసరికి తానెక్కడ వెనకడబడిపోతానో అన్నట్లుగా బీజేపీ నేతలు కూడా యాక్టివ్ అయిపోయారు. ఇది సరిపోలేదన్నట్లుగా బీజేపీ-జనసేన ఆధ్వర్యంలో మంగళవారం రామతీర్ధం-ధర్మయాత్రంటు మరో షో జరిగింది.



ఇక తిరుపతి లోక్ సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నపుడే వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాదరావుకు 2.28 లక్షల మెజారిటి వచ్చింది. మరిపుడు అధికారంలో ఉండటం, గడచిన 18 మాసాలుగా ఎన్నో సంక్షేమపథకాలు అమలు చేస్తుండటం తమకు మరింత కలిసి వస్తుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు. ప్రతిపక్షాల్లో ఏపార్టీకి డిపాజిట్లు కూడా రాకూదన్నది జగన్మోహన్ రెడ్డి భావనగా వైసీపీ నేతలు చెబుతున్నారు. సరే చివరకు ఏమవుతుందన్నది ఇపుడే చెప్పలేం. ఎందుకంటే ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఓట్లేయాలో ఎవరిని దూరంగా పెట్టాలో ఓటర్లకు బాగా తెలుసు.



ఇక ప్రతిపక్షాల్లో టీడీపీ పరిస్ధితి చాలా బలహీనంగా ఉంది. ప్రతి ఎన్నికకు ఓ కొత్త అభ్యర్ధని తీసుకొస్తుండటం వల్లే తిరుపతి లోక్ సభలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయింది. దానికితోడు అభ్యర్ధి పనబాక లక్ష్మి అంటే చాలామంది సీనియర్ నేతల్లో పెద్ద సానుకూలత కనబడటం లేదు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో తెచ్చుకున్న సుమారు 4.8 లక్షల ఓట్లు తెచ్చుకునేది కూడా డౌటే. ఇక బీజేపీ+జనసేనల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది 16500 ఓట్లు. జనసేన అయితే పోటీయే చేయలేదు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 24 వేలు. వీళ్ళందరికి వచ్చిన ఓట్లకన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కు ఎక్కువ ఓట్లు 25 వేలు వచ్చాయి. సో, ఉపఎన్నికల్లో గెలిచిపోవాలని ప్రతిపక్షాలు గోల చేయటం లేదు. వైసీపీ మెజారిటిని తగ్గించటమే తమ విజయంగా భావిస్తున్నట్లున్నాయి. అందుకనే ఇంత గోల చేస్తున్నాయి. కాబట్టి ఉపఎన్నిక జరిగి ఫలితం వచ్చేవరకు ఈ గోల జరుగుతునే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: