హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ లేఖ విడుదలపై సుప్రిం కీలక వ్యాఖ్యలు

Vijaya

కొంతమంది న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన లేఖను జగన్మోహన్ రెడ్డి విడుదల చేయటంపై సుప్రింకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, ఆరుగురు న్యాయమూర్తులతో పాటు సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ పై చేసిన ఫిర్యాదు లేఖను మీడియాకు విడుదల చేయటం తప్పేమీ కాదంటూ తాజాగా సుప్రింకోర్టు ధర్మాసనం తేల్చేసింది. పై న్యాయమూర్తులపై జగన్మోహన్ రెడ్డి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి లేఖ రూపంలో ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల తర్వాత తన లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం మీడియా సమావేశం పెట్టి బయటపెట్టారు. ఎప్పుడైతే జగన్ ఫిర్యాదు వెలుగు చూసిందో దేశమంతా సంచలనమైంది. ఫిర్యాదు లేఖను మీడియాకు విడుదల చేయటంపై జగన్ కు వ్యతిరేకంగా అనేకమంది న్యాయనిపుణులు, ఇతరులు సుప్రింకోర్టులో కేసులు వేశారు.




అలాగే సుప్రింకోర్టు న్యాయవాది, బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి కూడా ఎలాగైనా సరే జగన్ను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రూపంలో ఇరికించాలని పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనతో పాటు ఢిల్లీ బార్ అసోసియేషన్ నుండి కూడా ఒకరిద్దరు లాయర్లు లేఖను విడుదల చేసినందుకు జగన్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కేసులు వేశారు. అయితే ఇదే విషయమై జీఎస్ మణి, ప్రదీఫ్ కుమార్ దాఖలు చేసిన కేసును సుప్రింకోర్టు ధర్మాసనం విచారించింది. పిటీషనర్ల వాదన విన్న తర్వాత త్రిసభ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పిటీషన్లను కొట్టేసింది. సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన ఫిర్యాదు లేఖను మీడియాకు విడుదల చేయటంలో తప్పేమీ లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు విధించిన గ్యాగ్ఆర్డర్ నే సుప్రింకోర్టు బెంచి కొట్టేసిన తర్వాత లేఖ విడుదల అంశంపై విచారణే అవసరం లేదని అభిప్రాయపడింది.




అలాగే జగన్ కు సీఎంగా ఉండే అర్హత లేదని దాఖలైన కేసును కూడా కొట్టేసింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసులు వేయటం ఏమటంటూ మండిపడింది. ఫిర్యాదును మీడియాకు విడుదల చేసిన ఘటనలో ఎలాగైనా జగన్ను ఇరికించాలని చూసిన వాళ్ళకందరికీ ధర్మాసనం పెద్ద షాక్ ఇచ్చినట్లే అర్ధమవుతోంది. గ్యాగ్ ఆర్డర్ చెల్లదని ఇంతకు ముందే ఓ బెంచి కొట్టేయటం ఇపుడు లేఖ విడుదల అంశంపై వేసిన కేసును కొట్టేయటం జగన్ ప్రత్యర్ధులకు రుచించని అంశమనే చెప్పాలి. అలాగే మూడు నాలుగు కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు కూడా పిటీషనర్ల వాదనను తోసిపుచ్చింది. కేసులు వేసి జగన్ను ఇబ్బంది పెడదామని ప్రయత్నిస్తున్న వారికి తాజాగా న్యాయస్ధానాల వైఖరి మింగుడుపడటం లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: