హెరాల్డ్ ఎడిటోరియల్ : ఈనెలాఖరులోనే రాజకీయ సమీకరణలు మారిపోతాయా ?

Vijaya
ఈ నెలాఖరులో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ?  ఢిల్లీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఈమధ్యనే ప్రధానమంత్రి నరేంద్రమోడితో జగన్మోహన్ రెడ్డి భేటి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమావేశంలోనే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఎన్డీఏలోకి వైసిపి చేరటం దాదాపు ఖాయమైపోయిందట.  జగన్ ప్రస్తావించిన ప్రత్యేకహోదాకు ఆల్టర్నేటివ్ గా మరో భారీ ప్యాకేజీ ఇవ్వటానికి ప్రధానమంత్రి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపి అభివృద్దికి భారీ అర్ధిక ప్యాకేజిని ప్రధాని తొందరలోనే ప్రకటించబోతున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ప్యాకేజీ కూడా బీహార్ ఎన్నికల సమయంలోనే ప్రకటించాలని డిసైడ్ చేశారట.




ఈనెల 28వ తేదీ నుండి బీహార్ ఎన్నికల మొదటి విడత పోలింగ్ మొదలవుతుంది. దీనికి ముందే బీహార్ ఎన్నికల ప్రచారంలో మోడితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గొనబోతున్నారు. బీహార్ పర్యటనలో ఆ రాష్ట్రానికి ప్రకటించబోయే ప్రత్యేక ప్యాకేజీపై ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందట. ఇందులో భాగంగానే ఏపికి కూడా దాదాపు అటువంటి ప్యాకేజీనే ప్రకటించేందుకు ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రత్యేకహోదా కానీ లేకపోతే దానికి సమానంగా ప్రత్యామ్నాయ ప్యాకేజీని కానీ ప్రకటించకుడా తాము ఎన్డీఏలో చేరితే ఇబ్బందులు మొదలవుతాయని జగన్ స్పష్టంగా చెప్పినపుడు మోడి కూడా సానుకూలంగా స్పందించారట. ఆ సందర్భంలోనే  భారీ ప్యాకేజీ విషయంపై చర్చ జరిగింది.




పార్టీ నేతల నుండి అందుతున్న సమాచారం ప్రకారమైతే ఎన్డీఏలో వైసీపీ చేరటం ఖాయం. అదికూడా పరిస్ధితులన్నీ సానుకూలమైతే ఈ నెలాఖరులోనే ఈ మేరకు ఓ ప్రకటన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇప్పటికే ఎన్డీఏలో నుండి శివసేన, అకాలీదళ్ వెళ్ళిపోయాయి. వాటి స్ధానంలో  కొత్తగా ఏ పార్టీలు కూడా చేరలేదు. పైగా ఇపుడు కూటమిలో ఉండే పార్టీల్లో బీజేపీ తర్వాత చెప్పుకోదగ్గ పార్టీ కూడా లేదు. ఉన్న పార్టీలన్నింటికీ మహా అయితే నాలుగు లేదా ఐదు ఎంపిలుంటే చాలా ఎక్కువ. ఇటువంటి నేపధ్యంలోనే వైసీపీ అవసరం చాలా ఉందని మోడి భావించారు. ఎందుకంటే వైసీపీకి ప్రస్తుతం పార్లమెంటులో 28 ఎంపిల బలం ఉంది. 28 మంది ఎంపిల బలమున్న పార్టీ మాటలు కాదు. అందుకనే జగన్ కు మోడి ఇంతగా ప్రాధాన్యత ఇస్తున్నది.




ఇక భవిష్యత్తు అవసరాలను చూసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి  ఎన్డీఏ ప్రధానంగా బీజేపీ ప్రతిష్ట తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో కేంద్రం విఫలమైందని ప్రతిపక్షాలతో పాటు జనాలు కూడా బలంగా నమ్ముతున్నారు.  ఇటువంటి అనేక మైనస్ పాయింట్లతో మోడి కేంద్రాన్ని నడుపుతున్నారు. మరో మూడున్నరేళ్ళ తర్వాత మోడి వ్యక్తిగత ఇమేజి కూడా మసకబారిపోవటానికే అవకావాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో బలమైన ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా మూడోసారి అధికారంలోకి రావటం ఎన్డీఏకి కష్టమే. ఉత్తరాధిలో ఎన్డీఏకి నమ్మకమైన బలమైన గట్టి మిత్రపార్టీ లేదన్నది వాస్తవం. ఇదే సమయంలో దక్షిణాదిలో ఎన్డీఏకి అసలు మిత్రులే లేరు. నమ్మకమైన గట్టి మిత్రపార్టీ కోసం వెతుకులాటలో భాగంగానే మోడికి బహుశా జగన్ కనబడుండచ్చు. కాబట్టి జగన్ డిమాండ్లకు మోడి సానుకూలంగా స్పందించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఇద్దరినీ కలుపుతున్నవి కేవలం అవసరాలు, అవకాశాలు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: