హెరాల్డ్ ఎడిటోరియల్ : జీవీఎంసి దెబ్బకు సబ్బం స్ధాయి ఏంటో తేలిపోయిందా ?
ఇటువంటి నేపధ్యంలోనే శనివారం ఉదయం జీవీఎంసి ఉన్నతాధికారులు సబ్బం హరి ఇంటి కాంపౌండ్ ను కూల్చేశారు. మున్సిపల్ పార్క్ స్ధలాన్ని ఆక్రమించేసుకుని కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నారనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఆరోపణలపై ఈ మధ్య చాలా ఫిర్యాదులే అందుతున్నాయి. ఫిర్యాదులన్నింటినీ విచారించుకున్న ఉన్నతాధికారులు సబ్బంకు నోటీసులిచ్చారు. అయితే ఆ నోటీసులను తీసుకోవటానికి మాజీ ఎంపి నిరాకరించటంతో దాన్ని ఇంటికి అంటించేశారు. శుక్రవారం నోటీసును ఇంటికి అంటించేసిన అధికారులు శనివారం ఉదయమే జేసీబీలను తెప్పించి కూల్చేశారు. దాంతో మండిపోయిన సబ్బం జగన్+విజయసాయిరెడ్డి అండ్ కో పై నోటికొచ్చినట్లు తిట్టదండకం అందుకున్నారు.
సబ్బం పార్కు స్ధలాన్ని ఆక్రమించుకున్నారన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. తనకు నోటీసు ఇవ్వకుండానే కాంపౌండ్ వాల్ ను కూల్చేయటం ఏమిటని సబ్బం అడుగుతున్నాడే కానీ తాను స్ధలాన్ని ఆక్రమించుకోలేదని మాత్రం చెప్పటం లేదు. ఇక్కడే మాజీ ఎంపి కేసు వీకైపోయింది. ఇందుకనే సబ్బంకు మద్దతుగా ఒక్క చంద్రబాబునాయుడు తప్ప ఇంకెవరు మాట్లాడటం లేదు. తనతో పెట్టుకుంటే ప్రభుత్వంలో భూకంపాలు పుట్టిస్తాననేట్లుగా చెప్పుకునే సబ్బంకు స్ధానికంగా ఉండే ఏ నేత కూడా ఎందుకు మద్దతుగా రాలేదు. చంద్రబాబు కూడా అర్ధరాత్రి కాంపౌండ్ వాల్ కూల్చేయటం ఏమిటని అడుగుతున్నాడే కానీ సదరు స్ధలం సబ్బందే అని చెప్పలేకపోతున్నాడు. చంద్రబాబు బాధ ఇలాగుంటే వైజాగ్ లో నే ఉన్న టీడీపీ నేతల్లో చాలామంది సబ్బంకు మద్దతుగా నోరే విప్పలేదు. టీడీపీ నేతలే ఈ విధంగా ఉంటే ఇక మిగిలిన పార్టీల నేతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.