ఎడిటోరియల్ : 'హోదా' పోగుట్టుకుంటున్న టీడీపీ ! ఎందుకిలా అవుతోంది ?
చంద్రబాబుతో కలిసి 23 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. కానీ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి దూరమై జగన్ కు జై కొట్టారు. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రేపో మాపో టిడిపిని వీడి జగన్ కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం బలం 18 పడిపోయింది. ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు ఇదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్న తీరు ఇప్పుడు ఆ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, పార్టీ నేతల్లోనూ, రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పెరిగిపోతుండటం, చంద్రబాబు తర్వాత పార్టీని ఆ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే వారు లేకపోవడం, టీడీపీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉండదనే అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ, టిడిపి నాయకులను పూర్తిగా కట్టడి చేసే విధంగా ప్రయత్నించడం, ఇలా అనేక కారణాలతో క్షేత్రస్థాయిలో టిడిపి క్యాడర్ అంతా భయాందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైపు వారంతా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున నాయకులు పార్టీని వీడి వెళ్లిపోగా, మిగిలిన మరి కొంతమంది నాయకులు ఇప్పుడు వైసిపి బాట పట్టేలా కనిపిస్తున్నారు. తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు వంటివి ఉండటం, క్యాడర్ చెల్లాచెదురైపోతూ ఉండటం వంటి పరిణామాలు ఆ పార్టీ అధినేత చంద్రబాబులో ఆందోళన పెంచుతున్నాయి. పార్లమెంటరీ కమిటీల పేరుతో యువ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చారు.
త్వరలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు నియామకం చేపట్టబోతున్నారు. అయినా పరిస్థితుల్లో మార్పులు వచ్చేలా కనిపించకపోవడం, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తుండడంతో, ఎక్కడ లేని ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పుడు టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బిజెపి అయినా తమతో జత కలుస్తుందా అంటే వారు మరింత దూరం పెడుతూ, అసలు పొత్తు ఆలోచనే పెట్టుకోవద్దని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ టీడీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతే, తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం లేకపోలేదు.