హెరాల్డ్ ఎడిటోరియల్ : అమరావతి ఆందోళనల వెనుక అసలు విషయం చెప్పేసిన ఎల్లోబ్యాచ్
మూర్తి మాటలు నిజమే అనుకున్నా వ్యాపారమన్న తర్వాత లాభ, నష్టాలు రెండు ఉంటాయి కదా. చంద్రబాబు వ్యాపార భాగస్వామిగా ఉన్నపుడు రైతులు పెట్టుబడులకు మించి బాగా లాభలు రాబట్టుకున్నారు. అయితే ప్రభుత్వం మారగానే అంటే మూర్తి మాటల ప్రకారమే వ్యాపార భాగస్వామిగా జగన్మోహన్ రెడ్డి రాగానే లాభాలు ఆగిపోయాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన రైతులకు నష్టాలైతే రాలేదు. రైతులు ఆశించిన స్ధాయిలో లాభాలు రావటం లేదు కాబట్టే ఇపుడు గోల చేస్తున్నట్లు స్పష్టమైపోయింది. వచ్చినట్లు రైతులు ఎందుకు ఆలోచించటం లేదు. వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే రావుకదా. నష్టాలు కూడా వస్తాయన్న విషయం మూర్తిలాంటి మేథావులు అక్కడి రైతులకు ఎందుకు వివరించి చెప్పటం లేదు.
మూర్తి మాటల్లోనే రాజధాని నిర్మాణమన్నది కేవలం 5 కోట్లమంది రాజధాని అని కాకుండా కేవలం 29 వేలమందికి చెందిన ఓ వ్యాపారం అన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. చంద్రబాబు ప్రారంభించిన రాజధాని నిర్మాణమనే వ్యాపారంలో రైతులు కూడా పెట్టుబడులు పెట్టారు. మరి లాభాలొచ్చినంత కాలం వచ్చాయి. ఇపుడు ఆగిపోయాయంతే. మరి ఇంతోటి దానికి రైతులు ఎందుకింతగా గోల చేస్తున్నారో అర్ధం కావటం లేదు. రాష్ట్రంలో 5 కోట్లమంది ప్రజలుంటే కేవలం 29 వేలమంది మాత్రమే లాభపడటం అన్యాయం కాదా ? రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు ఏమి పాపం చేసుకున్నారు ? 29 వేలమందితో మాత్రమే వ్యాపార భాగస్వామ్యం ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చింది ? అసలు సమస్యంతా ఇక్కడే కదా మొదలైంది.
ఇందుకే కదా అమరావతి ఉద్యమం మొత్తం పెట్టుబడి, రియల్ ఎస్టేట్ దళారుల ఉద్యమని వైసిపి మొదటి నుండి మొత్తుకుంటోంది. వైసిపి చెబుతున్నది కరెక్టే అని ఇపుడు మూర్తి కూడా నిర్ధారణ చేశాడంతే. జగన్ కు వ్యతిరేకంగా అమరావతిలో ఉద్యమం మొదలైన దగ్గర నుండి ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులే కనబడుతున్నారంటూ వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలను మూర్తి సమర్ధించినట్లయ్యింది. రాజధానిని అమరావతి ఉద్యమం బోగస్ అన్న అభిప్రాయంతో మిగిలిన ప్రాంతాల జనాలుండబట్టే దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. మొత్తానికి రాజధానిగా అమరావతి తరలిపోకుండా ఎల్లోబ్యాచ్ చెప్పే పిచ్చి లాజిక్కులు విని జనాలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం కూడా లేకపోయింది వీళ్ళకు.