మన భారతదేశ సంస్కృతిపై విషం చిమ్ముతున్న "బిగ్ బాస్" పాశ్చాత్య సంస్కృతి...!
పరోక్షంగా సినిమాలు, సీరియల్స్, రియాలిటీ షోలు ఇలా ఎంటర్టైన్మెంట్ రంగం కూడా దీనికి ప్రధాన కారణంగా తయారైంది.
ఇక అసలు వివరాల్లోకి వెళితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన రియాల్టీ షోగా పేరు గాంచిన 'బిగ్ బ్రదర్' అనే కార్యక్రమం 1999లో నెదర్లాండ్స్ దేశంలో ప్రారంభించబడింది. అది ఆ తర్వాత 'బిగ్ బాస్'గా రూపాంతరం చెంది మన ఇండియన్ టెలివిజన్ కార్యక్రమంగా రూపొందించబడింది.దానిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే...ఒక పెద్ద ఇల్లు తీసుకొని అందులో కొంత మంది ఆడవాళ్ళని, కొంత మంది మగ వారిని కూడా కలిపి ఆ ఇంట్లో ప్రవేశపెట్టి కొన్ని రోజులు అందులో వాళ్లని ఉంచి, ఆ ఇంటిలో ప్రతి చోటా అంటే బాత్రూం కారిడార్లో నుంచి పడుకునే బెడ్ రూం వరకు ప్రతీ చోటా సీసీ కెమెరాలు అమర్చి వాటి ద్వారా వ్యక్తుల చర్యలని, వాళ్ళ మధ్య సంభాషణలనీ, గొడవలని మాత్రమే కాకుండా వాళ్లకి వివిధ రకాల విన్యాసాలతో కూడిన ఆటలు, పోటీలు పెట్టి విచిత్ర వేషధారణలు వేయించి వాటన్నింటినీ రికార్డు చేసి మరీ సుమారుగా వంద రోజులకు పైబడి ప్రముఖ ఛానళ్ల ద్వారా టెలికాస్ట్ చేస్తున్నారు.
మన భారతదేశంలో అన్ని మతాలవారు, అన్ని కులాల వారు సనాతనమైన, సమ్మతమైన, ఉత్తమమైన, పటిష్టమైన కుటుంబ వ్యవస్థను ఆచరిస్తున్నారు. ఇది పూర్తిగా పాశ్చాత్య దేశాల్లో అవలంబించే సంస్కృతికి విరుద్ధమైనది. కానీ ఇక్కడ మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ బిగ్ బాస్ కార్యక్రమంని సుమారుగా రెండు గంటల పాటు చూసి ఆనందిస్తున్నారు. ఈ బిగ్ బాస్ హౌస్ లో వివాహితులు, అవివాహితులు (ఆడ, మగ మరియు థర్డ్ జెండర్) అందరూ కలిసిమెలిసి సుమారు వంద రోజులు సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవనం లో వీరు చేస్తున్న వెకిలి పనులు (కౌగిలింతలు, ముద్దులు వగైరా), వేసుకుంటున్న దుస్తులు, వివిధ భంగిమలతో దర్శనమిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనం చిన్నపిల్లలతో సహా కుటుంబ సమేతంగా వీక్షించటం వల్ల భవిష్యత్ తరాలకు మనం అందించబోయే, తెలియజేసే నాగరికత ఏమిటో ఒకసారి ఆలోచించండి. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడే ప్రయత్నంలో మీవంతు పాత్రను గుర్తించండి.