కరోనా మహమ్మారి దేశం నుంచి తరిమి కొట్టేందుకు కేంద్రం, రాష్ట్రాలు శక్తివంచన లేకుండా, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటూ, ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చాయి. ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నాయి. కఠినమైన ఆంక్షలతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు విధించారు. ఈ సమయంలో ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతోమంది ప్రాణాలు హరించుకుపోయాయి. మరెంతో మంది ఉపాధికి దూరమయ్యారు.
ఒక రకంగా చెప్పాలంటే... సామాన్యుడి బతుకు చిత్రం చిన్నాభిన్నం అయ్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా కుదేలు అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితులు దాపురించాయి. ఎన్ని చేసిన కరోనా మహమ్మారి ని కట్టడి చేయడం సాధ్యపడలేదు. ఇప్పటికే వేలాది కేసులు నమోదవుతూనే వస్తున్నాయి. మహా నగరాల నుంచి, కుగ్రామాల వరకు అన్ని చోట్ల ఈ మహమ్మరి పాతుకుపోయింది. ఇక మాస్క్ లు పెట్టుకుని తిరగడం ఒక అలవాటుగా జనాలు చేసుకున్నారు. ఎన్ని చేసినా, ఎన్ని రకాల కఠిన ఆంక్షలు విధిస్తున్నా, ఈ మహమ్మారి రోజురోజుకు రెట్టింపు వేగంతో దూసుకు వెళుతూ పెను సవాల్ విసురుతోంది.
కేవలం భారత్ లోనే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారి కారణంగా విలవిల్లాడుతున్నాయి. అసలు ఈ కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో వదిలి వెళ్లి కాదనే విషయం జనాలకు అర్థం అయిపోయింది. దేశంలో మూడు విడతలుగా లాక్ డౌన్ విధించారు. ఆ సమయంలో ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలు అవడంతో, క్రమక్రమంగా సడలిస్తూ వచ్చారు.అయితే సుదీర్ఘకాలం లాక్ డౌన్ నిబంధనలు విధించడం వల్ల జనాలు మరింతగా ఇబ్బంది పడడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ ఉండడం తప్ప పెద్దగా ప్రయోజనం లేదన్న అభిప్రాయంతో కేంద్రం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఇకపైన కరోనా తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వాలే అంచనా వేసి, ఈ వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధంగా చేసుకోవాలి. ఈ వ్యవహారాల్లో కేంద్ర జోక్యం లేకుండా చేసుకునేందుకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు గా కనిపిస్తోంది. ఇక ప్రజలు సైతం ఎవరికి వారు స్వీయ నిబంధనలు విధించుకుని ఈ కరోనా ప్రభావానికి గురి కాకుండా చూసుకోవడం ఒకటే మార్గంగా కేంద్రం ఆలోచన ఉంది.అలాగే ఈ కరోనా ను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందనే విమర్శలు రాకుండా, పూర్తిగా రాష్ట్రాల పైన, ప్రజల పైన ఈ భారం వేసే విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.