హెరాల్డ్ ఎడిటోరియల్ : పైకి కనిపిస్తున్నది ఈశ్వరయ్యే కానీ అసలు టార్గెట్ ఎవరో తెలుసా ?

Vijaya
గడచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో  ఎల్లోమీడియా చేస్తున్న రచ్చ అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ ఎంతచిన్న విషయం కనబడినా గ్లోరిఫై చేసేస్తోంది. తమ చానళ్ళల్లో, పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు, వార్తలు, డిబేట్లు పెట్టేసి ప్రభుత్వంపై విరుకుకుపడుతున్న విషయం అందరు చూస్తున్నదే. గడచిన ఏడాదిగానే ఎల్లోమీడియా ఎందుకిలా ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది ? ఎందుకంటే తమకు గిట్టని, ఆజన్మ శతృవు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కాబట్టే. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఎన్ని ఘోరాలు జరిగినా రాష్ట్రమంతా పచ్చగా ఉన్నట్లే ఎల్లోమీడియాకు. అదే జగన్ హయాంలో మాత్రం చిన్న విషయాన్ని కూడా బాగా పెద్దదిగా చేసేసి రాష్ట్రానికి ఎదో ఉపద్రవం వచ్చేసినట్లుగానే నానా యాగీ చేసేస్తోంది. తాజాగా విజయవాడలో కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం,  జస్టిస్ ఈశ్వరయ్య ఘటనలనే ఉదాహరణలుగా తీసుకుందాం.



విజయవాడలోని స్వర్ణప్యాలెస్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి 11 మంది చనిపోయారు. ఇంత పెద్ద ఘటన జరిగినా ఎల్లోమీడియాలో సొంతంగా కథనాలు లేవు. టీవీల్లో రోజులతరబడి డిబేట్లు లేవు. పరిశోధనాత్మక వార్తలు వెతికినా కనబడవు. ఏదో ఘటనను కవర్ చేయాలి కాబట్టి కవర్  చేశాయంతే. ఎందుకిలాగంటే ఆసుపత్రి యాజమని రమేష్  బాబు చౌదరి కాబట్టే. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజధాని జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గంలోని ప్రముఖుల్లో ఒకడు కాబట్టే. తమ వాడన్న ఏకైక కారణంతోనే ఘటన ఎంత పెద్దదైనా ఎల్లోమీడియాలో ప్రముఖంగా కనబడదు. చంద్రబాబు కూడా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించాడంతే. ఘటనపై దర్యాప్తు చేయాలని, బాధ్యులను శిక్షించాలని ఎక్కడా డిమాండ్ చేయలేదు. జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే  బాధ్యత వహించాలని ఎక్కడా డిమాండ్ చేయలేదు. ఇదే  ఘటన ప్రభుత్వాసుపత్రిలోనో లేకపోతే మరో సామాజికవర్గానికి చెందిన వాళ్ళ ఆసుపత్రిలోనో జరిగుంటే వ్యవహారం ఇలాగే ఉండేదా ?



సరే ఇపుడు జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారం చూద్దాం. ఈశ్వరయ్య-సస్పెన్షన్లో ఉన్న మరో జడ్జి రామకృష్ణ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను పట్టుకుని ఎల్లోమీడియా ఎంతగా యాగీ చేస్తున్నదో అందరు చూస్తున్నదే. నిజానికి ఈశ్వరయ్యను ఏదో చేసేద్దామని కాదు ఎల్లోమీడియా తాపత్రయం. అసలు టార్గెట్ మొత్తం జగనే అన్న విషయం తెలిసిపోతోంది. జస్టిస్ ఫోన్లో మాట్లాడిన మాటలను ప్రభుత్వానికి చుట్టేద్దామని తెగ ప్రయత్నిస్తున్నది. ఈశ్వరయ్య మాటలను ప్రభుత్వం ఖండించలేదట. అలాగే జస్టిస్ పై చర్యలు తీసుకోలేదట. కనీసం జస్టిస్ నుండి వివరణను కూడా కోరలేదు కాబట్టి ఈయన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వం ఉన్నట్లు అర్ధమైపోతోందంటూ పేరులేని ఓ న్యాయ నిపుణుడు అభిప్రాయపడ్డాడంటూ ఎల్లోమీడియా తేల్చేసింది. 2019 ఎన్నికల్లో బిసిలు టిడిపిని వ్యతిరేకించటంలో  ఈశ్వరయ్య కూడా  ప్రధాన కారణమని చంద్రబాబు+ఎల్లోమీడియాకు బాగా మంటగా ఉంది.



ఈశ్వరయ్య వ్యాఖ్యలపై ఎప్పుడు స్పందించాలో ప్రభుత్వానికి తెలీదా ?  ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి ఎల్లోమీడియా చెప్పాలా ?  ఈశ్వరయ్య-రామకృష్ణ మధ్య జరిగిన  వ్యవహారాన్ని న్యాయస్ధానం చూసుకుంటుంది. మధ్యలో ఎల్లోమీడియాకు ఎందుకింత ఆతృత ? ఎందుకంటే ఈశ్వరయ్యను ముందుపెట్టి జగన్ను ఇరికిద్దామన్న ఆలోచన తప్ప మరోటి కనబడటం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని, జగన్ అధికారంలో ఉండేందుకు లేదని  చంద్రబాబు బలంగా కోరుకుంటున్నాడు. చంద్రబాబు కోరికే ఎల్లోమీడియా కోరిక. కాబట్టే ఓ పద్దతి ప్రకారం ప్రభుత్వంపై జనాలను రెచ్చగొట్టేందుకు  చంద్రబాబు, ఎల్లోమీడియా ఇప్పటికి ఎన్నిసార్లు ప్రయత్నించినా  జనాలు పట్టించుకోవటం లేదు.



ఇటువంటి పరిస్ధితుల్లోనే జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఈశ్వరయ్యను ట్రాప్ చేయటానికి చంద్రబాబు+ ఎల్లోమీడియానే ప్లాన్ చేసి రామకృష్ణను ప్రయోగించాయా ? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇక్కడ చంద్రబాబు, ఎల్లోమీడియా టార్గెట్ జగనే కానీ ఈశ్వరయ్య కాదన్న విషయం తెలిసిపోతోంది. కాకపోతే జస్టిస్ ను అడ్డుపెట్టుకుని జగన్ను ఏదో సాదిద్దామని ఎల్లోమీడియా ప్రయత్నిస్తున్నట్లే అనుమానాలు పెరుగుతున్నాయి.  అందుకనే ఈశ్వరయ్య వివాదంలోకి జగన్ను పదే పదే పిక్చర్లోకి  లాగుతోంది. చూద్దాం  ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో ? ఎల్లోమీడియా ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: