తెలంగాణకు షాక్..! జగన్ ప్రభుత్వానికి అతి పెద్ద విజయం..?
ఇదే నిజమైతే.. ఇది జగన్ సర్కారుకు అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. కృష్ణా నదీ జలాల్లో తమ వాటాగా దక్కిన నీటిని వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంను చేపట్టింది. కర్నూలు జిల్లాలో ఎత్తిపోతల పథకం నిర్మించి, విస్తరణ పనులు చేపట్టి వరద నీటిని తరలించాలన్నదే ఈ రాయలసీమ ఎత్తిపోతల ఉద్దేశం. అంతరాష్ట్ర వివాదంగా మారిన రాయలసీమ ఎత్తిపోథల పథకం అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయం సాధించి ముందడుగు వేసిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ పరమైన అనుమతులు అవసరం లేదంటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీ తేల్చిచెప్పిందని.... దీంతో ఈ ప్రాజెక్ట నిర్మాణానికి ప్రధానమైన అడ్డంకి తొలగిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం అక్రమం అంటూ తెలంగాణకు చెందిన రాజకీయ పక్షాలు, మరికొందరు రాజకీయ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారు. పర్యావరణ పరమైన అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కోర్టుకెక్కారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించాయి.
ఇప్పటికే ఎన్జీటి రెండు దఫాలు విచారించి తొలిదశలో నిర్మాణం చేపట్టరాదంటూ స్టే విధించినప్పటికీ ..ఆ తర్వాత స్టే ను ఎత్తివేసి తుది అనుమతులు కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని చెప్పిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలుత విచారించి తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఏపి సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో తెలంగాణ అభ్యంతరాలను కొట్టేస్తూ ఏపి ప్రభుత్వ అభిప్రాయాలతో ఏకీభవించిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ ను అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాయి.