ఎడిటోరియల్: 'తీరంలో చీలిక' వెనుక కుట్ర కోణం ఉందా ? జస్ట్ డౌట్ అంతే !
కులం.. కుట్ర.. కుతంత్రం.. వెన్నుపోటు.. స్వార్ధం ఇంకా చాలా చాలా ...! ఇవన్నీ ఎందుకంటే రాజకీయం కోసమే. రాజకీయాలు నడవాలంటే ఇవన్నీ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడి రాజకీయాలో మనకెందుకు ఆంధ్రా రాజకీయాలనే ఉదాహరణగా తీసుకుంటే...? ఎన్నో కుట్రలు, కుతంత్రాలు బయటకి వస్తాయి. ఎప్పుడైతే ఆంధ్రా - తెలంగాణ విభజన జరిగిందో.. అప్పటి నుంచి ఏపీ రాజకీయాలు గజిబిజి గందరగోళం అన్నట్టుగా మారిపోయాయి. ఆంధ్ర తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ళపాటు హైదరాబాద్ లో ఏపీ రాజధాని ఉండే హక్కు ఉన్నా.. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే చంద్రబాబు ఓటుకి నోటు కేసులో ఇరుక్కోవడం, అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చడం వంటి సంఘటనలన్నీ జరిగాయి. ఇక అమరవాతే రాజధాని అని అప్పటి టీడీపీ ప్రభుత్వం గట్టిగానే చెప్పడంతో దాదాపు అంతా దానికే ఫిక్స్ అయిపోయారు.
కానీ అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో విమర్శలు మూటగట్టుకుంది. రాజధాని ప్రకటనకు ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు, బినామీ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేశారని, వారి భూములు విలువ పెంచుకునేందుకు కాస్త ఆలస్యంగా రాజధానిగా అమరావతిని ప్రకటించారని టిడిపి ఇప్పటికీ విమర్శలు చేస్తోంది. అప్పట్లో ఈ విషయంపై ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పెద్దఎత్తున హడావుడి చేసింది. ఇక 2019 ఎన్నికల్లో వైసిపి భారీ మెజార్టీతో గెలవడంతో ఇక అమరావతి వ్యవహారం పూర్తిగా పక్కన పడిపోయింది. మూడు రాజధానులు అనే అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చి, విశాఖను రాజధానిగా చేసేందుకు నిర్ణయించుకుని, ఆ మేరకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ, అమరావతి నుంచి రాజధాని విశాఖకు తరలిపోకుండా టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
విశాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిపాలనలో రాజధానిగా పనికిరాదనే విషయాన్ని తెరపైకి తెచ్చే విధంగా అనేక కథనాలు టీడీపీ అనుకూల మీడియా లో ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఓ ప్రధాన పత్రికలో "తీరంలో చీలిక " అనే కథనం ప్రచురితం కావడంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. సముద్ర అంతర్భాగంలో చీలిక ఏర్పడిందని, ఆ చీలిక కారణంగా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉందని, అది ఎప్పుడనేది స్పష్టంగా చెప్పలేం అంటూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ కె ఎస్. కృష్ణ అభిప్రాయంగా ఆ ప్రధాన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ చీలిక విశాఖకు 100 కిలోమీటర్లల దూరంలోనే ఉందని, ఆ కథనంలో పేర్కొనడంపై అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. విశాఖను పరిపాలన రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచే ఇదే రకమైైన కథనాలు వస్తున్నాయి. తాజాగాా సీఆర్డీఏ రద్దు వ్యవహారం గవర్నర్ ఆమోదం కు వెళ్లిన నేపథ్యంలో అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చేసేందుకు ఇప్పుడు ఈ విధమైన కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సముద్ర గర్భంలో చీలిక ఏర్పడినప్పుడు తీరం వైపు కుంగి పోయిందని, అత్యధికంగా 900 మీటర్ల వరకు కుంగినట్లు ఆధారాలుు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
విశాాఖ తీరానికి సమీపంలోనే కుంగుబాటు ఎక్కువగా ఉందని, దాని ప్రభావం నగరంంపై పడే అవకాశాలు ఉన్నట్లుగా ఆ కథనంలో పేర్కొన్న విషయాలను బట్టి చూస్తే, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు పెను ప్రమాదంలో ఉన్నారనే విషయం అర్థం అవుతోంది. కాకపోతే ఈ కథనం అంతా కల్పితమేనని, కేవలంం విశాఖను పరిపాలన రాజధాని ప్రకటించకుండా ఉండేందుకు, ప్రజల్లోనూ ఈ విషయంపై ఆలోచన రేకెత్తించి రాజధానిగా అమరావతిని కొనసాగించే విధంగా ఒత్తిడి పెంచేందుకుగా, ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు జనాల్లో కలుగుతున్నాయి.
ఒకవేళ ఆ కథనమే, ఆ పరిశోధనే వాస్తవమే అయి ఉంటే, తీరానికి సమీపంలో ఉన్న పట్టణాలు, పల్లె అనే తేడా లేకుండా జనాలందరనీ తరలించాల్సి వస్తుంది. మరి ఈ విషయాన్ని కూడా ఆ కథనంలో పేర్కొని ఉంటే, కేంద్రం కూడా దీనిపై దృష్టి పెట్టి, దేశవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాలపై సర్వే చేయించేది. అలాగే పట్టణాలు, పల్లెలు, అన్నిటినీ తరలించే ఆలోచన చేసి ఉండేది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.