హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రభుత్వానికి హైకోర్టు  ఫైనల్ వార్నింగ్ .. అసలేం ఏం జరుగుతోంది ?

Vijaya
తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణాలో పెరిగిపోతున్న కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ హైకోర్టు మండిపోయింది. గతంలో తామెన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ దుమ్ము దులిపేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ చాలా ఘాటుగా హెచ్చరించటం సంచలనంగా మారింది. వైరస్ నేపధ్యంలో ఓ హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని మరీ ఇంత ఘాటుగా హెచ్చరించటం బహుశా దేశంమొత్తం మీద తెలంగాణాలోనే అయ్యుంటుంది.

అసలు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చింది ?  ఎందుకంటే కేసీయార్ ఉదాసీనతే కారణమని చెప్పాలి. ఓ వైపు తెలంగాణాలో విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు దాదాపు రెండు నెలల క్రితమే చెప్పినా పట్టించుకోలేదు. వైరస్ రోగుల నుండి ప్రైవేటు ఆసుపత్రులు లక్షలకు లక్షలు బిల్లులు వేసి పిండేస్తున్నా పట్టించుకోలేదు. బిల్లులు చెల్లించలేక రోగుల కుటుంబీకులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిపై చాలామంది కోర్టులను ఆశ్రయించాల్సొచ్చింది. క్వారంటైన్ సెంటర్లు, ఐసొలేషన్ వార్డులు పెంచాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. వైరస్ వ్యాప్తికి ప్రధానంగా ఓల్డ్ సిటినే కారణమని జనాల్లో విస్తృతమైన చర్చ, ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.

వివిధ దశల్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి కోర్టు ఎన్ని సూచనలు చేసినా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. జనాలందరికీ ర్యాపిడ్ టెస్టులు చేయించాలని, వైద్య సిబ్బంది మొత్తానికి పిపిఇ కిట్లు అందించాలని కోర్టు ఆదేశించినా పెద్దగా ఫలితం కనబడలేదు. ఇదే విషయమై చాలామంది కోర్టుల్లో కేసులు వేశారు. దాంతో  ప్రభుత్వానికి కోర్టు ఎన్ని సూచనలు చేసినా, హెచ్చరికలు చేసినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. ఒకవైపు రోజుకు వేలాది కేసులు నమోదవుతున్నా హైకోర్టు ఆశించిన స్ధాయిలో ప్రభుత్వంలో చలనం కనబడలేదు. ముఖ్యమంత్రి కేసీయారే దాదాపు మూడు వారాలుగా ఎక్కడా  కనబడలేదు.

ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసుల పరంపరతో హైకోర్టుకు మండిపోయింది. అందుకనే  కరోనా వైరస్ విషయంలో జనాలను ప్రభుత్వం గాలికొదిలేసిందంటూ మండిపడింది. తెలంగాణాలో కన్నా ఏపిలో పరిస్ధితి చాలా మెరుగ్గా ఉందని కితాబిచ్చింది. కోర్టు ఆదేశాలను పాటించని అధికారులపై తాము ఎందుకు సీరియస్ చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం వస్తుందో లేదో చూడాలి. మొత్తానికి జనాల్లో కూడా ప్రభుత్వంపై బాగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. కేసీయార్ ను డైరెక్టుగా ఏమనలేకే ప్రభుత్వంపై మండిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కేసీయార్ క్రియాశీలమైతే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: