మీడియా మంటలు: తెలుగు మీడియాలో ఈ యాజమాన్యాలకు చుక్కలే...!
లాక్‌డౌన్ ప్రభావంతో తెలుగు మీడియాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మీడియానే నమ్ముకుని జీవితాలను నెట్టుకొస్తున్న జర్నలిస్టులు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. యాజమాన్యాలు నిష్కర్షగా వ్యవహరిస్తున్న పరిస్థితి కళ్లకు కడుతోంది. జీతాల్లో కోత పెట్టడం, 50 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపేయడం వంటి చర్యలు మీడియాలో సర్వసాధారణంగా మారిపోయాయి. వాస్తవానికి ద్రవ్యోల్బణం పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు సరిపోని స్థితి నెలకొంది. కానీ, ఇప్పుడు కరోనా పేరు చెప్పి.. నిన్నటి వరకు పోగేసుకున్న వందల వేల కోట్లను కదిలించకుండా.. యాజ మాన్యాలు చేస్తున్న నిరంకుశ వైఖరితో ఉద్యోగులు అగచాట్లు పడుతున్నారు.
తెలుగు మీడియాలో అన్ని ఛానెళ్లు, పత్రికల్లో ఉద్యోగులపై కరోనా ప్రభావం ఈ రూపంలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. జీతాలు సగం అయ్యాయి.. ఉద్యోగాలు సగం అయ్యాయి. దీంతో యాజమాన్యాలు ఇప్పటికిప్పుడు పండగ చేసుకున్నా.. భవిష్య త్తు మాటేంటి? ఇప్పుడంటే.. కరోనా నేపథ్యంలో వ్యాపారం తగ్గిపోయింది కాబట్టి ఉద్యోగులను ఉన్నపళాన కలుపు మొక్కల కన్నా హీనంగా తీసేశారు. జీతాలు కోసేశారు. మరి రేపు పరిస్థితి చక్కబడి పుంజుకున్న తర్వాత యాజమాన్యాల స్థితి ఏంటి? భద్రతలేని ఉద్యోగాన్ని తిరిగి అందుకునేందుకు తీసేసిన ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నారా? అంటే.. ఎట్టి పరిస్థితిలోనూ లేరనే అంటున్నారు.
ఇప్పటికే తీసేసిన ఉద్యోగులు తమ కు వచ్చే పీఎఫ్ సొమ్ముతో ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే బెటరని తలపోస్తున్నారు. కొందరు వ్యవసాయం సహా స్వయం ఉపాధి వైపు మళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంకొందరు పాఠశాలలు లేదా ట్యూషన్ పాయింట్లు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇది దీర్ఘకాలంలో తెలుగు మీడియాపై ప్రభావం చూపుతుంది. ఎందుకు చూపుతుంది? అవసరమైతే.. యాజమాన్యాలు కొత్తవారిని తీసుకుంటాయి. అప్పాయింట్‌మెంట్ చేసుకుంటాయి..గా అంటే.. అసలు ఇప్పుడున్నజనరేషన్‌కు తెలుగుపై సాధికారత లేదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. పైగా జర్నలిజంలో ఉద్యోగాలకు భరోసా లేదనే విషయం ఇప్పుడు ప్రచారం అవుతున్న విధంగా గతంలో ఎప్పుడూ లేదు.
దీంతో నేటి యువత లేదా వచ్చే రెండు మూడేళ్లలో వచ్చే యువత ఎట్టి పరిస్థితిలోనూ ఈ రంగంలోకి వచ్చి వీళ్లు విదిలించే సొమ్ముకు ఆశపడుతుందనే అంచనాలు కూడా లేవు. ఇటీవల ఓ తెలుగు ప్రముఖ పత్రిక ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందన బాగున్నా.. తెలుగు మీడియంలో చదివిన వారు మాత్రం పట్టుమని వందలోపే ఉండడం, వారిలోనూ అతి తక్కువ మందికి మాత్రమే తెలుగుపై సాధికారత ఉండడాన్ని బట్టి ఇప్పుడు యాజమాన్యాలు తోక ఝాడించినా..రేపు తోక ముడుచుకోక తప్పదని అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు.