మంత్రి బుగ్గన.. విశ్వ ప్రయత్నాలు ఫలిస్తాయా?

ఏపీలో పెట్టుబడుల కోసం జగన్ సర్కారు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సహా పలువురు మంత్రులు ఇటీవల బెంగళూరు, చెన్నైల్లో నిర్వహించిన ఇన్వెస్టర్ల రోడ్‌షోలకు హాజరై ఏపీలో అవకాశాలను వివరించారు. చెన్నైలో నిర్వహించిన రోడ్ షోకు హాజరైన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఏపీలోని వనరులు, మౌలిక వసతులపై వివరించారు.
దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్ లు ఉన్నాయని.. మూడు  పారిశ్రామిక కారిడార్ లలో 50 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

ఈ కారిడార్ లకు పోర్టులు కూడా అనుసంధానం అయి ఉన్నాయని.. కొత్తగా మరో 3 పోర్టుల నిర్మాణం కూడా చేపట్టాయని.. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి ఇటీవలే విశాఖను రాజధానిగా ప్రకటించారని.. ఏపీలో ఉన్న కాస్మోపాలిటన్ నగరం విశాఖేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటున్నారు. విశాఖ ఉక్కు, తూర్పునౌకాదళ కమాండ్, హిందుస్తాన్ షిప్ యార్డ్, పోర్టు లాంటి కీలకమైన సంస్థలు ఉన్నాయని.. విశాఖకు సమీపంలోనే భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నామని.. దీంతో పాటు పరిశ్రమలకు అనుసంధానంగా 6 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు కూడా ఉన్నాయని ఏపీలో అవకాశాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.

ఏపీలో 888 కిలోమీటర్ల జాతీయ జలరవాణా మార్గం ఉందని.. 2029కి 10 మిలియన్ టన్నుల కార్గోను జలరవాణా మార్గాల ద్వారా నిర్వహించాలన్నది ప్రణాళికగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగ  పరిశ్రమలు, పోర్టులు వ్యవసాయాధారిత పరిశ్రమల్లో పెట్టుబడులకు ఆస్కారం ఉందని.. అనంతపురంలో కియా, భారత్ ఫోర్జ్, ఇసుజు లాంటి వాహన సంస్థలు ఉన్నాయని.. కియా కార్ల పరిశ్రమ సమీపంలోని మరో కొరియాను తలపించేలా ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

పారిశ్రామిక కార్గో రవాణా కోసం లాజిస్టిక్స్ కారిడార్ , పార్కులు ఉన్నాయని.. ఏపీలో ఆర్ధిక, పెట్టుబడుల వాతావరణం అనుకూలం కాబట్టే ఇన్ని పరిశ్రమలు ఉత్పత్తి రంగంలో ఉన్నాయని.. ఏపీలో 70 శాతం మంది జనాభా పనిచేసే వయస్సులో ఉన్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: