తెలంగాణకు టెక్నాలజీ రంగంలో మరో ముందడుగు..?

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ లో తెలంగాణకు తొలిరోజే కీలక విజయం లభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రాబోతుందని కేటీఆర్ అంటున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కు చెందిన సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఫోరం నిర్వాహకులు ప్రకటించడం ఆనందాన్నిస్తోంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దీనికి సంబంధించిన ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్ , తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ లు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.

దావోస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ,పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందే తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు ఈ కేంద్రం ఏర్పాటే నిదర్శనం అని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇది తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సెన్సెస్ రంగం ఎదుగుదల, ఎకో సిస్టం పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ముందడుగు. జీవశాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ అంశాలపై సీ.ఫోర్.ఐ.ఆర్ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత దేశంలో సీ ఫర్ ఐ.ఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు.  ప్రస్తుతం అమెరికా, బ్రిటన్  దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయని.. ఈ కేంద్రం ఏర్పాటు కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

 హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటు వల్ల ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యాక్సిన్ లు, ఎన్నో ఔషధాల తయారీలో భారతదేశం, హైదరాబాద్ లకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. నాలుగవ పారిశ్రామిక విప్లవ సాంకేతికతను ఉపయోగించుకొని ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ పవర్ హౌస్ గా ఇండియా మారుతుంది. ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు తేవడంతో పాటు రోగులకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంలో ఈ కొత్త కేంద్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: